‘పెద్ది’ తరవాత రామ్ చరణ్ సినిమా సుకుమార్ తో అనేది అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 30న ‘పెద్ది’ వస్తోంది. ఆ తరవాత కొన్ని రోజులు విరామం తీసుకొని, సుక్కు సినిమా మొదలెట్టేస్తారు చరణ్. మొన్నామధ్య సుకుమార్ – చరణ్‌ల మధ్య భేటీ జరిగింది. కథేమిటన్నది సుకుమార్ డిటైల్డ్ గా వినిపించార్ట. కథ లాక్ కూడా అయిపోయింది. ప్రస్తుతం సుకుమార్ తన టీమ్ తో కలిసి ఈ కథని ఫైన్ ట్యూన్ చేస్తున్నారు.
చరణ్ తో సుకుమార్ కథ ఓకే అయిపోయిందన్న సంగతి తెలియగానే… ఈసారి ఎలాంటి జోనర్‌తో సినిమా చేయబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ‘రంగస్థలం’ అనేది ఓ రూరల్ డ్రామా. ఈసారి అర్బన్ కథైతే బాగుంటుందన్న అందరి ఆశ. అయితే సుకుమార్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఈసారి జోనర్ కంటే.. క్యారెక్టరైజేషన్‌పై ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. క్యారెక్టర్ చుట్టూనే కథ నడపాలని సుకుమార్ భావిస్తున్నార్ట.
సుకుమార్ తొలి సినిమా ‘ఆర్య’ క్యారెక్టర్ డ్రివైన్ స్టోరీనే. లేటెస్ట్ గా ‘పుష్ప’ మరో మంచి ఉదాహరణ. పుష్ప క్యారెక్టర్ చుట్టూనే కథంతా నడుస్తుంది. ఈసారి కూడా క్యారెక్టరైజేషన్ పైనే సుకుమార్ దృష్టి పెట్టారు. చరణ్ పాత్రని డిజైన్ చేసిన విధానం మెస్మరైజింగ్ గా ఉండబోతోందని టాక్. ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటి వరకూ చరణ్ చేయలేదని, అది నచ్చే ఈ కథని చరణ్ ఓకే చేశారని తెలుస్తోంది. ‘పెద్ది’ తరవాతే.. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక వివరాలు బయటకు వస్తాయని టాక్.
