తెలుగు ఇండస్ట్రీకి మానస వారణాసి రూపంలో మరో కొత్తమ్మాయి వచ్చింది. మిస్ ఇండియా కిరీట ధారి. ఇది వరకు ‘దేవకీ నందన వాసుదేవ’ అనే సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ’తో మరోసారి పలకరించింది. ఈ సినిమాలో తన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ బాగా నచ్చాయి. తన నటన కూడా చాలా సహజంగా అనిపించింది. పక్కింటి అమ్మాయి లాంటి పాత్రలకు తను మంచి ఛాయిస్. తెలుగు అమ్మాయి కాబట్టి, తన డబ్బింగ్ తానే చెప్పుకొంటుంది. డైలాగ్ డెలివరీ కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది. యంగ్ హీరోల సినిమాలకు తాను మంచి ఆప్ఫన్ కావొచ్చు.
ఈమధ్య యువ హీరోల సినిమాల్లో హీరోయిన్లని వెదికి పట్టుకోవడం చాలా కష్టమైపోతోంది. వాళ్ల వయసుకి తగిన కథానాయికలు దొరకడం దర్శక నిర్మాతలకు గగనం అయిపోతోంది. ఇలాంటి తరుణంలో మానస లాంటి కథానాయికలకు ఇక్కడ మంచి అవకాశాలు దొరుకుతాయనడంలో సందేహం లేదు. `కపుల్ ఫ్రెండ్లీ`లో భావోద్వేగభరితమైన సన్నివేశాల్లో తన నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. ఇలాంటి కథలు, యంగ్ హీరోల సినిమాలకు తాను మంచి ఛాయిస్. అయితే మానసలాంటి అమ్మాయిలకు లాంగ్ రన్ ఉండాలంటే తగిన కథల్ని, సరిపోయే పాత్రల్ని ఎంచుకోవాల్సిందే. మరో మార్గం లేదు. ‘కపుల్ ఫ్రెండ్లీ’కి విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. దానితో పాటుగా.. బాక్సాఫీసు వసూళ్లు వచ్చి, కమర్షియల్ హిట్ గా నిలిస్తే మానసకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. వాటిని తాను ఎంత వరకూ అందిపుచ్చుకొంటుందో చూడాలి.
