సినిమా ఇండస్ట్రీ ఇప్పటికే చాలా సమస్యలతో సతమతమవుతోంది. అందులో కొత్తగా రీ-రిలీజ్ సమస్య కూడా ఒకటి తయారైంది. పెద్ద హీరోల కల్ట్ క్లాసిక్ సినిమాల రీ-రిలీజ్ ట్రెండ్ గొప్ప సందడిగా నడుస్తోంది. ఇప్పటికే చాలా సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి. ఫాన్స్ వినూత్నంగా తమ ఆనందాన్ని, సరదాను వ్యక్తం చేస్తూ థియేటర్స్‌లోనే ఐకానిక్ సీన్లను రీ-క్రియేట్ చేయడం కనిపిస్తూనే ఉంది.
శుక్రవారం విడుదలైన మహేష్ బాబు ఖలేజా సినిమాకు మామూలు సందడి జరగలేదు. నిన్న భైరవం, షష్టిపూర్తి లాంటి సినిమాలతో పాటు ఇంకొన్ని చిన్న సినిమాలు కూడా వచ్చాయి. అయితే మహేష్ బాబు ఖలేజా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. కొత్త సినిమా రెస్పాన్స్ తెలుసుకోవాలంటే ప్రసాద్ మల్టీప్లెక్స్‌కి వెళ్తే అక్కడ వైబ్ అర్థమవుతుంది. కానీ నిన్న నిజంగా కొత్త సినిమాకు షాక్ లాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ మల్టీప్లెక్స్ అంతా “జై బాబు… జై జై బాబు…” అంటూ మహేష్ బాబు నినాదాలతో నిండిపోయింది. సోషల్ మీడియాలో కూడా ఖలేజా రీ-రిలీజ్ క్లిప్స్ డామినేట్ చేశాయి. దీంతో ఎంతో కొంత బజ్ ఉన్న భైరవం సినిమా వెనకబడినట్లు అనిపించింది.
ఇదే విషయాన్ని నిర్మాత రాధా మోహన్ దగ్గర ప్రస్తావిస్తే… ఆయన కూడా ఎఫెక్ట్ ఉన్న మాట నిజమేనని ఒప్పుకున్నారు. “మన చేతిలో ఏం లేదని, ఇది ఆడియన్స్ ఛాయిస్” అని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో ఛాంబర్ ఒక నిర్ణయం తీసుకుంటే బావుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో అక్కడే ఉన్న హీరో మంచు మనోజ్ కూడా దీనిపై తన ఆవేదన వ్యక్తం చేశారు. రీ-రిలీజ్ కొత్త సినిమా మీద స్ట్రెయిట్‌గా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికే ఐపీఎల్ కారణంగా, ఓటీటీ కారణంగా థియేటర్స్‌లో ఎఫెక్ట్ ఉంది. అలాగే పెద్ద సినిమాలన్నీ మంచి పండగ సీజన్లు, సెలవు సీజన్లు లాక్ చేసుకున్నాయి. చిన్న, మిడియం సినిమాలు ఏదో ఒక మంచి సమయం చూసి రిలీజ్ అవుతుంటే, రీ-రిలీజ్ ఎఫెక్ట్ పడుతుంది. దయచేసి వీకెండ్స్‌లో కాకుండా వీక్‌డేస్‌లో రిలీజ్ ఉంటే బావుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంలో పెద్దలందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు.
అయితే ఇప్పటికే ఛాంబర్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఏదీ పరిష్కారం కాకుండా మగ్గుతున్నాయి. “మా మధ్య ఐక్యత లేదని” స్వయంగా నిర్మాత దిల్ రాజు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో రీ-రిలీజ్ ఇష్యూని ఛాంబర్ తీసుకుని పరిశీలిస్తుందా అన్నది ప్రశ్నార్థకం. పైగా రీ రీలీజు సినిమాల్నీ పెద్ద నిర్మాతలవే. వాళ్లకు ఎదురు చెప్పేవాళ్లెవరు? ప్రస్తుతం అయితే `పర్సంటేజీ – అద్దె` వివాదమే నడుస్తోంది. దానిపై ఓ క్లారిటీ వస్తే తప్ప ఛాంబర్ మిగిలిన సమస్యలపై దృష్టి పెట్టలేదు.