నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ కోసం బకాయిపడ్డ రూ.8 కోట్ల పన్ను చెల్లించి కౌన్సిలర్‌గా పోటీ చేసిన కాటిపల్లి శమంత అనే కాంగ్రెస్ నాయకురాలకు అదృష్టం కలసి రాలేదు. ఆమె పోటీ చేసిన డివిజన్ లో బీజేపీ అభ్యర్థి మీసాల సవిత చేతిలో పరాజయం పాలయ్యారు. శమంతను కాంగ్రెస్ పార్టీ ముందుగానే మేయర్ అభ్యర్థిగా ప్రకటించడంతో బకాయి పడ్డ పన్నులతో పాటు.. ఎన్నికల్లో గెలుపు కోసం భారీగా ఖర్చు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఇతర కాంగ్రెస్ అభ్యర్థుల ఖర్చులను కూడా చూసుకున్నారని చెబుతున్నారు.
అయితే ఆమె ఓడిపోవడంతో పాటు.. కాంగ్రెస్ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ రాలేదు. భారీ స్థాయిలో ఖర్చు చేసి, పన్నులు చెల్లించి బరిలోకి దిగినప్పటికీ, ఓటర్ల తీర్పు మాత్రం ఆమెకు అనుకూలంగా రాలేదు. 19వ డివిజన్ నుంచి పోటీ చేసిన శమంత రెడ్డి ఓటమి పాలయ్యారు. మేయర్ పీఠం దక్కించుకోవాలనే లక్ష్యంతో అన్ని అడ్డంకులను తొలగించుకున్నప్పటికీ, ఎన్నికల ఫలితాల్లో ఆమె పరాజయం చెందింది.
60 కార్పొరేటర్ సీట్లు ఉన్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో బిజెపి 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మేయర్ పీఠం దక్కించుకోవడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 31 ను అందుకోలేకపోయింది. మరోవైపు, కాంగ్రెస్ 17 స్థానాలు, ఎంఐఎం 14 స్థానాలు కలిస్తే వారి సంఖ్యాబలం 31 కి చేరుకుంటుంది, దీనివల్ల ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే మేయర్ పీఠం కాంగ్రెస్ లేదా ఎంఐఎం పరం అయ్యే అవకాశం ఉంది. ఓడిపోయినందున శమంతరెడ్డికి మేయర్ పీఠం లభించదు.
