నీతులున్నది చెప్పడానికేనని ఆ చానల్ నిరూపిస్తోంది. చానల్ లోగోల్లో పెట్టి మరీ నీతులు చెబుతూ రావడంలో ముందు ఉంటుంది. కొంతకాలంగా బూతులు మాట్లాడే నేతల్ని.. సోషల్మీడియా సైకోల్ని తరిమికొట్టాలని ప్రోమో కూడా వేస్తోంది. కానీ ఇప్పుడు సాక్షాత్తూ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని అత్యంత దారుణంగా మాట్లాడిన మాజీ మంత్రిని మాత్రం సిగ్గు పడకుండా సపోర్టు చేస్తోంది.
ఆయన కు మద్దతుగా ఆయన ఇంటికి వెళ్లే ప్రతి రౌడీషీటర్.. ప్రతి అరాచక వాది మాటల్ని తన చానల్ ద్వారా వినిపిస్తోంది. అంబటి రాంబాబు ఏదో గొప్ప దేశభక్తి పని చేసి జైలుకు పోయాడన్నట్లుగా ఆయన ఇంటికి వెళ్లే వైసీపీ నేతలపై లైవ్ టెలికాస్ట్ ఇస్తోంది. వారితో అడ్డగోలు మాటలు మాట్లాడిస్తున్నారు. అనిల్ కుమార్ అనే నెల్లూరు మాజీ మంత్రి.. పోలీసులు వదిలి పెట్టి రండి.. ఒక్క రోజులో తేల్చుకుందాం అంటే.. అదేదో పెద్ద పోటుగాడి సవాల్ లాగా..బ్రేకింగులు వేసింది. అప్పిరెడ్డి అనే గుంటూరు రౌడీషీటర్ మాటలు కూడా ఆ చానల్ కు గొప్పగా ఉంటాయి.
అసలు అంబటి రాంబాబు అలా మాట్లాడటం తప్పని.. టీడీపీ నేతలు వ్యాఖ్యలు మాత్రం ఆ చానల్ లో ఎక్కడా వినపడవు. పది మంది వైసీపీ నేతలతో మాట్లాడించి..ఎక్కడో ఓ పది సెకన్లు టీడీపీ నేతవి చూపించి.. కవర్ చేశామని సంతృప్తి పడుతున్నారు. నేరుగా మద్దతు ఇవ్వలేక… ఇలా తమ ఎడిటోరియల్ స్టాండర్డ్ సెట్ చేసుకున్నారన్నమాట. ఎన్ని అయినా చేసుకోవచ్చులే కానీ.. ఆ నీతులు చెప్పే ప్రోమోలు మాత్రం ఆపేయాలని.. కొంత మంది సలహాలిస్తున్నారు.
