ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అమరావతి రాజధాని నిర్మాణంపై చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ట్వీట్ చర్చనీయాంశమైంది. విదేశాల్లోని ఆకాశహర్మ్యాలు , అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన ఒక వీడియోను ఒక యువతి షేర్ చేస్తూ.. మనం అమరావతిని ఇలా ఎప్పుడు చూస్తాం అని అడిగిన ప్రశ్నకు లోకేశ్ స్పందించారు. అమరావతిని అచ్చం అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి తమకు 15 ఏళ్ల సమయం ఇవ్వాలని ఆయన కోరారు.
రాజధాని నిర్మాణం అనేది ఒక రోజులోనో, ఏడాదిలోనో పూర్తయ్యే ప్రక్రియ కాదని, దానికి పక్కా ప్రణాళిక, నిరంతర కృషి అవసరమని లోకేశ్ పేర్కొన్నారు. గత ఐదేళ్లలో రాజధాని అభివృద్ధి కుంటుపడిందని విమర్శిస్తూనే, ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను పరుగులు పెట్టిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాకుండా, ప్రపంచస్థాయి టెక్నాలజీ, ఉపాధి అవకాశాలు మరియు మెరుగైన జీవన ప్రమాణాలకు అమరావతి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.
లోకేశ్ చేసిన ఈ ట్వీట్ వెనుక ఒక దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. రాజధాని అభివృద్ధికి ఎంత సమయం పడుతుందో.., రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం ఎంతటి నిబద్ధతతో ఉందో ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా యువతలో అమరావతిపై ఉన్న ఆశలను సజీవంగా ఉంచుతూ, రాబోయే ఒకటిన్నర దశాబ్ద కాలం రాష్ట్ర ప్రగతికి ఎంత కీలకమో ఆయన నొక్కి చెప్పారు. ఈ ట్వీట్‌కు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తున్నప్పటికీ, రాజధాని విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని లోకేశ్ మరోసారి చాటిచెప్పారు.
