నందమూరి బాలకృష్ణ తన కెరీర్లోనే పీక్ ఫామ్ లో ఉన్నారు. ఒకటా రెండా… వరుసగా 5 విజయాలు సొంతం చేసుకొన్నారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహారాజ్, అఖండ 2… ఇలా అన్నీ హిట్లే. టాప్ హీరోల్లో ఇలా వరుసగా ఐదు బ్యాక్ టూ బ్యాక్ విజయాలు అందుకొన్న హీరో… ఈమధ్య కాలంలో బాలయ్య మాత్రమే. పైగా ఈ రెండు మూడేళ్లలో బాలయ్య పారితోషికం కూడా అనూహ్యంగా పెరిగింది. ఇది వరకు బాలయ్య అందుకొన్నది రూ.10 కోట్ల లోపే. ఆ తరవాత… ఆ పారితోషికం డబుల్, ట్రిపుల్ అయ్యింది. `అఖండ 2` కోసం బాలయ్య దాదాపు రూ.40 కోట్లు అందుకొన్నట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్.
ఈ రెండు మూడేళ్లలో బాలయ్య సినిమాలకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా బాగా పెరిగాయి. ‘అఖండ 2’ ఓటీటీ రైట్స్ రూపంలో దాదాపు రూ.70 కోట్ల వరకూ రాబట్టినట్టు టాక్. హిందీ బెల్ట్ లో కూడా బాలయ్య సినిమాలకు ఆదరణ దక్కుతోంది. హిందీ డబ్బింగు రేట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మరోవైపు అన్ స్టాపబుల్ షో… కూడా దూసుకుపోతోంది. కొత్త సీజన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎం.ఎల్.ఏగానూ బాలయ్య దూకుడు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే హిందూపురం నుంచి హ్యాట్రిక్ అందుకొన్నారు. ఆయన్ని మంత్రిగానూ చూడాలన్నది అభిమానుల ఆశ…. ఆకాంక్ష. అయితే బాలయ్యకు ఒకే ఒక్క లోటు. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పటికప్పుడు ఆలస్యం అయిపోతోంది. ఈ విషయంలో అభిమానుల కూడా నిరుత్సాహ పడుతున్నారు. కనీసం 2026లో అయినా…. మోక్షుని వెండి తెరపైకి తీసుకొస్తారేమో చూడాలి. ఆదిత్య 999లో బాలయ్య, మోక్షు కలసి నటిస్తారన్న ప్రచారం జరుగతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పైప్ లైన్లోనే వుంది. మరి ఈ సీక్వెల్ కి అంకురార్పణ ఎప్పుడో, బాలయ్య అభిమానుల కోరిక ఎప్పుడు తీరేనో…!
