టీ-20 వరల్డ్ కప్ ఫైనల్స్‌కు భారత్ వెళ్తే తాను తప్పకుండా మ్యాచ్ చూడటానికి వెళ్తానని నారా లోకేష్ అన్నారు. తాను మ్యాచ్ చూడటంపై జగన్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ పులివెందుల ఎమ్మెల్యే కూడా మ్యాచ్ చూడటానికి రావాలని అనుకుంటే, ఆయనకు కావాల్సిన టికెట్‌ను తానే స్వయంగా కొని ఇస్తానని సరదాగా వ్యాఖ్యానించారు. మ్యాచ్ చూసేందుకు శ్రీలంక పోవాలా.. టీవీలో చూడొచ్చుగా అని జగన్ ఇటీవల ప్రెస్మీట్లో ప్రశ్నించారు.
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వివాదంలో హెరిటేజ్ సంస్థపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను లోకేష్ తప్పు పట్టారు. హెరిటేజ్ సంస్థకు, ఇందాపూర్ డెయిరీకి ఎటువంటి వ్యాపారపరమైన యాజమాన్య సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇందాపూర్ డెయిరీ కేవలం హెరిటేజ్ ఉత్పత్తులకు ఒక ‘కో-ప్యాకర్’ మాత్రమేనని వివరించారు. నాణ్యత విషయంలో తమ సంస్థకు ఉన్న దశాబ్దాల నమ్మకాన్ని దెబ్బతీసేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు.
సాక్షి పత్రిక, భారతి సిమెంట్స్ వంటి సంస్థలు ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయల లబ్ధి పొందాయని లోకేష్ గుర్తు చేశారు. తమ కుటుంబ వ్యాపారమైన హెరిటేజ్ ఏనాడూ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ప్రయోజనం పొందలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి, పారదర్శక వ్యాపారానికి మధ్య ఉన్న తేడా ఇదేనని వ్యాఖ్యానించారు.
మరో వైపు పార్టీ నేతలతో చేస్తున్న ఆత్మీయ సమావేశాలపైనా స్పందించారు. యువగళం పాదయాత్ర సమయంలో ప్రజలతో మమేకమైన తీరును గుర్తుచేసుకున్న ఆయన, ఆ తర్వాత వచ్చిన రెండేళ్ల విరామం వల్ల ఏర్పడిన గ్యాప్‌ను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ప్రజాప్రతినిధుల కుటుంబాలతో ఆత్మీయ భేటీలు నిర్వహిస్తున్నానని, ఈ సమావేశాల్లో కేవలం బంధుత్వాలు, అనుబంధాలకే ప్రాధాన్యత ఇస్తున్నామని, ఎక్కడా రాజకీయ ప్రస్తావన రావడం లేదని స్పష్టం చేశారు.
