హమ్మయ్య..పాకిస్తాన్ కరుణించింది! కానీ ఏమి ప్రయోజనం?

Pathankot

పాకిస్తాన్ లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడులకు పాల్పడ్డారని రెండు దేశాలకు తెలుసు. కనుక ఈ వ్యవహారంలో పాక్ దోషిగా తలదించుకోవలసిన పరిస్థితి ఉంది కానీ భారత్ తలదించుకోవడం విశేషం. పఠాన్ కోట్ పై దాడులు జరిగిన తరువాత నుంచి నిన్నటి వరకు పాక్ చాలా చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తున్నా భారత్ కిమ్మనకుండా అన్ని భరించడాన్ని ఏమనుకోవాలి? సహనం అనుకోవాలా లేక అయోమయం అనుకోవాలా?

పాకిస్తాన్ మాటలు, ఈ కేసులో అది వ్యవహరిస్తున్న తీరును గమనించినట్లయితే ఈ కేసులో దాని చిత్తశుద్ధి ఏపాటిదో దాని చూస్తే అర్ధమవుతుంది. పఠాన్ కోట్ దాడులపై దర్యాప్తు కోసం ఎన్.ఐ.ఏ. బృందం పాక్ లో పర్యటించాలనుకొంది. అదే విషయాన్ని పాకిస్తాన్ కి తెలియజేసింది. కానీ పాక్ మొదట అంగీకరించలేదు. నిన్న అంగీకరించింది. ఇప్పుడు ఎందుకు అంగీకరించడానికి సిద్దమయిందంటే మొన్న అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా పాక్ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించడం వలననే అని చెప్పవచ్చు.

ప్రధాని నవాజ్ షరీఫ్ సలహాదారు సర్తాజ్ అజీజ్ సోమవారం ఇస్లామాబాద్లో పాక్ మీడియా అడిగిన ఒక ప్రశ్నకు జవాబిస్తూ “ఎన్.ఐ.ఏ. బృందం పాకిస్తాన్ లో పర్యటించాలనుకొంటే భారత్ దాని కోసం అభ్యర్ధిస్తే పరిశీలిస్తాము,” అని జవాబు చెప్పారు.

పాకిస్తాన్ లో దర్యాప్తుకి తాము సిద్దంగా ఉన్నామని, పఠాన్ కోట్ దాడులకు పాక్ ఉగ్రవాదులే కారణమని నిరూపించేందుకు తమ వద్ద బలమయిన ఆధారాలున్నాయని ఎన్.ఐ.ఏ. డిజి శరద్ కుమార్ తెలిపారు. పాక్ లో భారత్ బృందం దర్యాప్తు జరపడానికి ఇప్పుడు పాక్ అంగీకరిస్తోంది కనుక ఎన్.ఐ.ఏ. బృందం పాక్ వెళ్లి రావచ్చు కానీ, పాక్ సహకారం లేనిదే ఆ దాడులకు కుట్ర పన్నినవారిని పట్టుకొని శిక్షించడం అసాధ్యం. పాక్ వైఖరి గమనిస్తే ఈ కేసు నుంచి ఏదో విధంగా తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం అవుతూనే ఉంది. అమెరికా మాట కాదనలేకనే ఎన్.ఐ.ఏ. బృందం పాక్ పర్యటనకు అంగీకరిస్తోంది తప్ప నిజంగా దోషులను పట్టుకొని శ్క్షించాలనే చిత్తశుద్దితో కాదని అర్ధమవుతూనే ఉంది. మరి అటువంటప్పుడు ఎన్.ఐ.ఏ. బృందం పాక్ వెళ్లి ప్రయోజనం ఏమిటి?ఆలోచించాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com