నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ చేయని ప్రయత్నం లేదు. ఆయనే మంట పెట్టారు. ఆయనే యుద్ధాలు ఆపారు. ఎవరూ చెప్పడంలేదని తనకు తానే డబ్బా కొట్టుకున్నారు. కానీ నోబెల్ టీం ఆయనను పట్టించుకోలేదు. కానీ ఆయన నోబెల్ సాధించారు. ఎలా అంటే అచ్చంగా బ్రహ్మీ భాస్కర్ అవార్డు సాధించినట్లే. నోబెల్ అవార్డు గెలుచుకున్న మచాడో తనకు వచ్చిన నోబెల్ ను వైట్ హౌస్ కు తీసుకెళ్లి ట్రంప్‌కు ఇచ్చారు. మదురోను అమెరికా జైల్లో పెట్టింది. వదిలి పెట్టే అవకాశం లేదు. అమెరికా సాయంతో వెనిజులాను తానే పాలించాలన్న ప్రయత్నంలో ఉన్న మచాడో ఆయనకు నోబెల్ ఇచ్చి తన రాజకీయ లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
తనకు మచాడో ఇచ్చిన నోబెల్ ను చూసుకుని మురిసిపోయిన ట్రంప్ మచాడో ఒక అద్భుతమైన మహిళ అని, ఆమె తనకు నోబెల్ మెడల్ ఇవ్వడం పరస్పర గౌరవానికి నిదర్శనమని పొగిడారు. అయితే, మచాడో తన మెడల్‌ను ట్రంప్‌కు ఇచ్చినప్పటికీ, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అనే బిరుదు మాత్రం బదిలీ కాదని నోబెల్ పీస్ సెంటర్ స్పష్టం చేసింది. ఒకసారి బహుమతిని ప్రకటించిన తర్వాత దానిని వెనక్కి తీసుకోవడం గానీ, ఇతరులకు బదిలీ చేయడం గానీ సాధ్యం కాదని కమిటీ తేల్చి చెప్పింది. మెడల్ యజమాని మారవచ్చు కానీ, నోబెల్ గ్రహీత అనే హోదా మారదు అని వారు స్పష్టం చేశారు. దీంతో సాంకేతికంగా మచాడో మాత్రమే నోబెల్ గ్రహీతగా కొనసాగుతారు. కానీ ట్రంప్ ..మెడల్ తనకు ఇచ్చారు కాబట్టి తానే నోబెల్ గ్రహీతనని చెప్పుకున్నా ఆశ్చర్యం ఉండదు.
మదురోను అమెరికా బంధించిన తర్వాత మచాడో అధ్యక్షురాలిగా వస్తారని అందరూ అనుకున్నారు. కానీ ట్రంప్ మాత్రం, ఆమెకు దేశంలో తగినంత మద్దతు గౌరవం లేవు అని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. దీనికి కారణం ట్రంప్ కోరుకుంటున్న నోబెల్ బహుమతి మచాడోకు రావడం ఆయనకు నచ్చకపోవడమే. ఆమె ఆ బహుమతిని తీసుకోకుండా, దానికి ట్రంప్ మాత్రమే అర్హుడు అని ప్రకటించి ఉంటే మదురోను తప్పించినప్పుడు అధ్యక్షురాలిగా చేసి ఉండేవారన్న విశ్లేషణలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆమె తన మెడల్‌ను ట్రంప్‌కు ఇచ్చి ఆయనను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని సులువుగా అర్థంచేసుకోవచ్చు.
ఇప్పటి వరకూ ట్రంప్ మచాడోను పక్కన పెట్టి డెల్సీ రోడ్రిగ్జ్‌ను తాత్కాలిక అధ్యక్షురాలిగా గుర్తించడానికి మొగ్గు చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆమె అమెరికా డిమాండ్లకు తలొగ్గడం. వెనిజులాలోని చమురు క్షేత్రాలను అమెరికా కంపెనీలకు అప్పగించే విషయంలో ఆమె సానుకూలంగా ఉండటంతో, ట్రంప్ ఆమెతోనే కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. అందుకే నోబెల్ ఇచ్చేసి..అమెరికా సాయంతో అధ్యక్షురాలిగా మారేందుకు మచాడో ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ ఏం చేస్తారో మరి?
