ప్రత్యేక హోదాకు ఆశలకు కేంద్రప్రభుత్వం మంగళం పాడేసిన నేపథ్యంలో కాకినాడ పవన్ కళ్యాణ్ సభపై సీమాంధ్ర ప్రజలు చాలా ఆశలు పెట్టకున్నారు. అయితే పవన్ కళ్యాణ్‌లో మాత్రం ఒరిజినాలిటీ ఎక్కడా కనిపించడం లేదు. అంతా కూడా రెగ్యులర్ పొలిటిషియన్స్ మాట్లాడే స్టైల్లోనే మాట్లాడుతున్నాడు. రాసుకొచ్చిన స్పీచ్ అంతా కూడా తన గురించి తాను చెప్పుకోవడానికే సరిపోయేలా ఉంది. నేను యోధుడ్ని, నేను వీరుడ్ని, నేను గొప్పవాడ్ని, నేను మీలో ఒక్కడ్ని, నేను ఎవ్వరికీ భజన సేన కాదు, గూండాలకు ఎదురు నిలబడతా లాంటి రొటీన్ మాటలు మాట్లాడుతూ ఉసూరనిపిస్తున్నాడు పవన్. ఎక్కడా కూడా 2009లో కనిపించిన పవన్ కళ్యాన్ కాదు కదా…కనీసం 2014 ఎన్నికల టైంలో కనిపించిన పవన్ కళ్యాణ్ కూడా కనిపించడం లేదు. అంతా కూడా సినిమాటిక్ ఎక్స్ప్రెషన్స్, డ్రమెటిక్ డైలాగ్స్‌తోనే పవన్ స్పీచ్ సాగుతోంది.
ప్రత్యేక హోదకు మోడీ మొండి చేయి చూపించడం, చంద్రబాబు కూడా చేతులెత్తేయడం గురించి మాట్లాడతాడని, అలాగే ప్రత్యేక హోదా సాధన కోసం భవిష్యత్‌లో తాను ఏం చేయబోతున్నాడో అన్న విషయాల గురించి మాట్లాడతాడు అనుకుంటే నాలుగు దశాబ్ధాల వెనకటి చరిత్ర, తెలంగాణా విడిపోయిన కాలం నాటి చరిత్రను చెప్తూ ఆల్రెడీ చచ్చిన కాంగ్రెస్ పార్టీని తిట్టటం కోసమే తన టైం అంతా స్పేర్ చేస్తున్నాడు పవన్. ఇప్పటి వరకూ కూడా నరేంద్రమోడీ గురించి కానీ, చంద్రబాబు గురించి కానీ ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం.
ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే ప్రజల హాజరు కూడా అనుకున్నంత స్థాయిలో లేకపోవడం. వచ్చిన వాళ్ళను, టివిలలో చూస్తున్న ప్రజలకు కూడా పవన్ ప్రసంగం నీరసం తెప్పిస్తోంది. నాకు రాజకీయ చరిత్ర మొత్తం తెలుసు, నేను రాజకీయాలు తెలిసిన రాజకీయ నాయకుడిని, మీలాగే నేనూ బాధపడుతున్నాను అని చెప్పుకుంటూ ఉన్నాడు పవన్. ప్రత్యేక హోదా గురించి కానీ, నరేంద్రమోడీ వంచన గురించి కానీ, చంద్రబాబు చేతకాని తనం గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. మరోసారి తిరుపతి సభలో చూపించిన డ్రమెటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌నే రిపీట్ చేస్తున్నాడు పవన్.
