పవన్ కల్యాణ్ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే పల్లెపండుగ పేరుతో గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల పనులు చేపట్టారు. ఇప్పుడు మరోసారి పల్లెపండగ 2.0 ప్రారంభించాలని అనుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పల్లెపండగ 2.0 కార్యక్రమంలో రూ.6,500 కోట్లతో వివిధ పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రహదారుల నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 52 వేల పనులకు ఒకేసారి శ్రీకారం చుట్టి, పల్లెల్లో పండగ వాతావరణం తీసుకురావాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటివారంలో కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. గత ఏడాది అక్టోబరులోనూ పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ.2వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ ఏడాది పల్లెల సర్వతోముఖాభివృద్ధికి వీలుగా పల్లెపండగ 2.0 కార్యక్రమం నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల సమీక్షలో అధికారులను ఆదేశించారు.
గత ఏడాది పల్లె పండగలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతోనే పనులు చేపట్టారు. రోడ్లు, కాలువలు, గోకులాల నిర్మాణాలకు ప్రాధాన్యమిచ్చారు. దాదాపు 4వేల కిలోమీటర్ల మేర సిమెంట్, తారురోడ్లు నిర్మించారు. ఈసారి ఉపాధిహామీ పథకంతో పాటు నాబార్డు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై), ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ప్రాజెక్టు, 15వ ఆర్థిక సంఘం, పంచాయతీల సాధారణ నిధులతో చేపట్టనున్న పనులు పల్లెపండగ 2.0 పరిధిలోకి తీసుకొస్తున్నారు.
ఉపాధి పథకంలో మెటీరియల్ కింద రావలసిన రూ.2,500 కోట్లను కేంద్రం త్వరలో విడుదల చేస్తుందని భావిస్తున్నారు. నాబార్డు, ఏఐఐబీ, పీఎంజీఎస్వై, 15వ ఆర్థిక సంఘం నిధులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని పెద్ద పంచాయతీల్లో సాధారణ నిధులు ప్రజల అవసరాల మేరకు ఖర్చుచేసేలా ఇందులో ప్రణాళికలు తయారుచేస్తున్నారు. పల్లె పండగ 2.0లో 1,107 పంచాయతీల్లో 55 కి.మీ. మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మించనున్నారు. కొన్ని పంచాయతీల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన డ్రెయిన్లు మిగతా పంచాయతీలకూ విస్తరిస్తున్నారు.