పవన్‌ది కేవలం ఆవేశమేనా? లేకపోతే అవకాశవాదమా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వబోతున్నారన్న విషయాన్ని పవన్ కళ్యాణ్‌కి ముందుగానే చేరవేసి,ఆ క్రెడిట్‌ని పవన్ కళ్యాణ్ అకౌంట్లో కూడా వేయడం కోసమే ఆయన చేత తిరుపతి సభను అప్పటికప్పుడు పెట్టించారన్న విమర్శలను నిజం చేస్తూ పవన్ కళ్యాన్ కాకినాడ సభ ప్రసంగం సాగింది. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు అని బిజెపి తేల్చేసింది. ప్యాకేజ్‌లో కూడా కొత్త విషయాలు అంటూ ఏమీ లేవు. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్న ఒక్క మాటే చెప్తే ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ప్యాకేజ్ ఆయింట్మెంట్ రాశారు. ఆ ప్యాకేజ్‌లో ప్రకటించిన నిధులు ఆంధ్రప్రదేశ్‌కి రావన్న విషయం వాస్తవం. ఒక్క పోలవరం ప్రాజెక్ట్ విషయం ఉదాహరణగా తీసుకుందాం. 2018కి ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేస్తామని టిడిపి, బిజెపి పార్టీలు రెండూ హామీ ఇచ్చాయి. పూర్తయ్యే ఛాన్స్ ఉందా? ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ స్వార్థం కోసం టిడిపి నాయకులు సైలెంట్‌గా ఉన్నారేమో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం అన్ని విషయాలూ తెలుసు. అందుకే వాళ్ళు పవన్ కళ్యాణ్ వైపు ఆశగా చూశారు.
ఈ సినిమా పవర్ స్టార్ మాత్రం చంద్రబాబుకంటే నైస్‌గా చేతులెత్తేశాడు. తనకు తెలిసిన గారడీలన్నీ చేశాడు ..ఆవేశ పడ్డాడు. ఆవేధన చెందాడు. ఇంకా రకరకాల ఎమోషన్స్‌ని వేదికపైన చూపించిన ఈ సినిమా నటుడు అసలు విషయమైన ప్రత్యేక హోదా గురించి మాత్రం మాట్లాడింది ఏమీ లేదు. పాడిందే పాడరా…..అన్నట్టుగా తిరుపతి సభలో మాట్లాడిన మాటలనే మరోసారి చెప్పుకొచ్చాడు. ఎప్పుడో జరిగిపోయిన చరిత్ర గురించి సోది చెప్పాడు. తన గురించి మాత్రం చాలా గొప్పగా చెప్పుకున్నాడు. పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కి కూడా ఆయన స్పీచ్ నచ్చే అవకాశం అస్సలు లేదు. చాలా చప్పగా సాగింది. ఒక టాపిక్‌కి మరో టాపిక్‌కి అస్సలు సంబంధం లేదు. స్పీచ్ మొత్తం రాసుకుని వచ్చినట్టుగా పేపర్ చూసి మరీ ప్రసంగిస్తూ ఉన్నప్పటికీ అంతా కూడా కామెడీ వ్యవహారమైపోయింది.
ఈ సభ తర్వాత పవన్ కళ్యాన్ పాలిటిక్స్ గురించి ప్రజలందరికీ కూడా రెండు సందేహాలు మాత్రం వస్తాయి. రాజకీయాల గురించి అస్సలు అవగాహన లేకుండా రచ్చబండ దగ్గర కూర్చుని రాజకీయాల గురించి చిత్తం వచ్చినట్టు మాట్లాడే రకమా? లేక టిడిపి, బిజెపిలతో పవన్ కళ్యాణ్‌కి ఉన్న ఒప్పందాల దృష్ట్యా వాళ్ళను విమర్శించలేక, వాళ్ళకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజల తరపున పోరాడే ధైర్యం చేయలేక, 2019 వరకూ ఎలాగో ఒకలాగా మేనేజ్ చేసేద్దాం అని ఆలోచిస్తున్న రాజకీయ నాయకుడా? అని.
ఈ రెండు సందేహాలు కూడా పవన్ పొలిటికల్ కెరీర్‌కి ,అలాగే నందమూరి బాలకృష్ణలా పవన్ కళ్యాణ్ స్పీచ్‌లు ఉంటున్నాయి అన్న కామెంట్స్ వినిపించినా కూడా ఆశ్ఛర్యపోవాల్సిన అవసరం లేదు. అది నిజమే.
