‘పెద్ది’ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అనగానే మెగా ఫ్యాన్స్ కూడా కాసేపు ఆలోచించారు. ఎందుకంటే రెహమాన్ ఫామ్ లో లేడు. తెలుగు ప్రేక్షకుల పల్స్ తనకు సరిగా తెలీదన్నది చాలామంది ఉద్దేశ్యం. వాటిని ‘చికిరి’ పాటతో పటాపంచలు చేసేశాడు రెహమాన్. ఈమధ్య కాలంలో సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేసిన పాటల్లో అదొకటి. ఇప్పుడు రెండో పాట వచ్చింది. ‘రై రై రారా’ అంటూ సాగిన ఈ పాటను రెహమాన్ స్వయంగా ఆలపించారు. జానీ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. హీరో ఇంట్రడక్షన్ పాట ఇది. గీత రచయిత అనంత శ్రీరామ్ హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తూ, అందరికీ అర్థమయ్యే రీతిలోనే విలువైన భావజాలాన్ని వినిపించే ప్రయత్నం చేశారు.
”పాతేసుకోకోయ్ అలా
నువ్ నిన్నే నీలోపల..
హే పాతికేళ్లకే నువ్ పాతబడిపోకురా..”,
”నిన్నటిలానే రేపున్నదంటే ఈరోజేం పీకావనే.
నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనీ…
ఆటనుకోకోయ్.. ఆటంటే బతుకోయ్
నీ ఆట బతకాలిరోయ్
మాటనుకోకోయ్ గెలుపంటే వెలుగోయ్
గెలుపయ్ నువ్వు వెలగాలిరోయ్
మండే గుండె నీలో లేదంటే
కాలూ చేయి ఉన్నా లేన్నట్టే..” – ఇలా అనంత శ్రీరామ్ సాహిత్యం అర్థవంతంగా సాగింది.
చరణ్ గ్రేస్.. యధావిధిగా కళ్లకు కట్టిన పాట ఇది. ఆ ఎనర్జీ.. బాడీని బాణీకి అనుగుణంగా మలిచిన తీరు.. ఫ్యాన్స్‌కే కాదు.. అందరికీ నచ్చుతుంది. జానీ మాస్టర్ కంపోజింగ్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది. చాలా లెంగ్తీ స్టెప్పుల్ని చరణ్ చాలా ఈజీగా వేసినట్టు అర్థమవుతోంది. ఈ పాట కూడా కొంతకాలం మార్మోగడం ఖాయం. అన్నట్టు చివర్లో పెద్ది మార్క్ షాట్ ఒకటి కనిపించింది. చికిరి లో చరణ్ కొట్టిన సిక్సర్ బాగా వైరల్ అయ్యింది. ఈసారి కూడా అలాంటి వెరైటీ షాట్ డిజైన్ చేశాడు బుచ్చిబాబు. ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
