ప్రొ.నాగేశ్వర్ : గవర్నర్ నేరుగా డీజీపీకి ఫోన్ చేసి తప్పు చేశారా..?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఇప్పుడు గవర్నర్ ను టార్గెట్ చేశారు. విమానాశ్రయంలో జగన్ పై దాడి జరిగిన తర్వాత… గవర్నర్ నరసింహన్ ఢిల్లీ నుంచి నేరుగా.. ఏపీ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు ఫోన్ చేసి… వివరాలు తెలుసుకోవడమే కాకుండా.. అర్జంట్ గా నివేదిక ఇవ్వమని ఆదేశించినట్లు ప్రచారం జరిగింది. దీనిపై చంద్రబాబు మండిపడ్డారు. గవర్నర్ కు ఉన్న అధికారం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కుట్రతోనే… గవర్నర్ ఇలా ప్రవర్తిస్తున్నారని ఢిల్లీలో కూడా ఆరోపించారు. గవర్నర్‌కు ఏ విధమైన సమాచారం కావాలని ముఖ్యమంత్రిని సంప్రదించాలి కానీ అధికారులతో మాట్లాడటమేమిటని విమర్శిస్తున్నారు.

నిజంగా గవర్నర్‌కు ఈ అధికారాలున్నాయా..?

ప్రభుత్వం గవర్నర్ పేరిట పని చేస్తుంది. అసెంబ్లీలో గవర్నర్ చేసే ప్రసంగంలో నా ప్రభుత్వం అంటూ ప్రసంగిస్తారు. కాబట్టి… గవర్నర్ పేరు మీద ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి గవర్నర్‌కు ఎగ్జిక్యూటీవ్ పవర్స్ ఉంటాయనుకోవడం పొరపాటు. అధికారులు అందరూ గవర్నర్ కిందనే పని చేస్తారనుకోవడం పొరపాటు. ఎగ్జిక్యూటీవ్ పవర్స్ మొత్తం ముఖ్యమంత్రికి ఉంటాయి. గవర్నర్ … ప్రభుత్వాధినేత కావొచ్చు కానీ… అధికారాలు ఏమీ ఉండవు. అయన ఓ రాజ్యాంగ పరమైన అధినేత మాత్రమే. కానీ ఎగ్జిక్యూటీవ్ అధినేత మాత్రం కాదు. కార్యనిర్వాహక అధినేత ముఖ్యమంత్రి అవుతారు. రాజ్యాంగపరమైన అధినేత గవర్నర్ అవుతారు. అందువల్ల .. గవర్నర్ మై గవర్నమెంట్ అంటున్నారు కదా.. అని నేరుగా.. అధికారులకు ఫోన్ చేసే అధికారం లేదు. ఫోన్ చేసి రిపోర్ట్ చేయమనే అధికారం లేదు. గవర్నర్‌కు ఏదైనా రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో మాత్రమే.. కార్యానిర్వహక అధికారాలను… రాజ్యాంగం ఇచ్చింది. శాసనసభ అప్పుడు రద్దు అయినా ఉంటుంది లేక.. సస్పెండెడ్ మోషన్ లో ఉంటుంది కను… గవర్నర్ కు ఆ అధికారాలు నిర్వహిస్తారు. అది కూడా.. సలహామండలి సలహాల మేరకే పని చేయాలి. నేరుగా.. గవర్నర్‌కు ఎక్కడా అధికారాలు ఉండవు.

గవర్నర్‌ రాజ్యాంగ ప్రతినిధే తప్ప.. పాలకుడు కాదు..!

హైదరాబాద్ విషయంలో గవర్నర్‌కు… ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 8 కొన్ని అధికారాలు ఇచ్చారు. ఆ విచక్షణా అధికారాలు కూడా.. తన ఇష్టం వచ్చినట్లు .. ఆచరించడానికి వీల్లేదు. తెలంగాణ మంత్రివర్గ సలహా మేరకే ఆచరించాలన్న నిబంధన ఉంది. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. ఏపీలో.. ఓ ప్రజా ప్రభుత్వం ఉండగా… ఓ ముఖ్యమంత్రి ఉండగా.. గవర్నర్ ఎగ్జిక్యూటీవ్ పవర్స్‌లోకి చొరబడటం.. రాజ్యాంగ బద్ధం కాదు. రాజ్యాంగపరంగా మంచి సంప్రదాయం కాదు. గవర్నర్ డీజీపీతో మాట్లాడకూడదని.. ఎక్కడైనా రాసి ఉందా అని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగం ఎలా పని చేస్తుందంటే.. ఒకటి రాజ్యాంగం అధికరణలు.. రెండు రాజ్యాంగ సంప్రదాయాల ఆధారంగా పని చేస్తుంది. జ్యాంగ సవరణ ద్వారారాష్ట్రపతి కూడా.. స్వతంత్రంగా పని చేసే అవకాశాన్ని కూడా తొలగించారు. మంత్రి వర్గ సలహా ద్వారా మాత్రమే.. రాష్ట్రపతి కూడా పని చేయాల్సి ఉంటుంది. గవర్నర్ అనే వ్యక్తి.. రాజ్యాంగ ప్రతినిధే తప్ప.. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కాదు. అంటే.. అర్థం ఏమిటంటే.. రాజ్యాంగపరమైన పరిధిలో మాత్రమే గవర్నర్ పని చేయాలి. గవర్నర్ తనకు కావాల్సిన సమాచారాన్ని ముఖ్యమంత్రి ద్వారా తెప్పించుకోవచ్చు.

ముఖ్యమంత్రి నుంచి మాత్రమే సమాచారం తీసుకోవాలి..!

రాష్ట్ర ప్రభుత్వం చేసే చట్టాలు… రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గురించి కానీ.. ఇతర అంశాలను కానీ… ముఖ్యమంత్రి గవర్నర్‌కు నివేదించాల్సి ఉంటుంది. గవర్నర్‌ అనుమతి తీసుకోవాల్సిన పని లేదు. కానీ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అలా అని సమాచారం ఇవ్వకుండా చేశారని.. గవర్నర్ నేరుగా.. ఏ అధికారినీ ప్రశ్నించలేరు. చర్య తీసుకునే అధికారం కూడా లేదు. గవర్నర్‌కు ఏదైనా సమాచారం కావాలంటే.. సీఎం నుంచి సమాచారం తెప్పించుకునే హక్కు ఉంది. కానీ అలా కాకుండా.. చీఫ్ మినిస్టర్ ను పక్కన పెట్టి.. నేరుగా.. అధికారులను సంప్రదిస్తాననే అధికారం లేదు. రాజ్యాంగ స్ఫూర్తి రీత్యా సరైనది కాదు. రాజ్యాంగాధినేత కావొచ్చుకానీ.. రాజ్యాన్ని పాలించరు. రాష్ట్రపతి దేశానికి ప్రాతినిధ్యం వహించవచ్చు కానీ.. దేశాన్ని పాలించలేరు. రాష్ట్రపతి ఎలానో.. గవర్నర్ అలానే. కేంద్రం నుంచి రాష్ట్రాలు అధాకారాలు పొందవు. రాష్ట్రాలకు కూడా.. అధికారాలు రాజ్యాంగం నుంచే వస్తాయి. గవర్నర్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించవచ్చు కానీ.. రాష్ట్రాన్ని పరిపాలించరు. ఇది గవర్నర్‌కు రాజ్యాంగ రీత్యా ఉన్న పరిమితులు.

రాష్ట్రపతి పాలన దిశగా ప్రయత్నాలు చేశారా..?

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో.. గవర్నర్ నేరుగా డీజీపీకి ఫోన్ చేశారు. దీంతో.. ఆయన ఏపీ ప్రభుత్వ అధికారాల్లో వేలు పెట్టారని విమర్శలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ప్రయత్నం చేశారని ఆరోపణలు చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఓ వైపు బీజేపీ నేతలు.. ఏపీలో రాష్ట్రపతిపాలన విధించాలని కోరుతున్నారని..మరో వైపు నేరుగా.. డీజీపీతో గవర్నర్ మాట్లాడుతున్నారని.. దీని వెనుక కుట్ర ఉందని.. చెబుతున్నారు. అంటే… నేరుగా.. రాష్ట్రపతి పాలనకు కుట్ర జరుగుతోందన్న విషయాన్ని నేరుగా ప్రజల్లోకి పంపుతున్నారు. గవర్నర్ చర్య రాష్ట్రపతి పాలన విధించే దిశగా వెళ్తోందన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపుతున్నారు. కానీ… కచ్చితమైన ఆధారాలు లేవు. కేవలం డీజీపీతో మాట్లాడినంత మాత్రాన కుట్ర పన్నారని చెప్పడం కరెక్ట్ కాదు. ఎవరో చెప్పారని.. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదికలిస్తున్నారని.. ముఖ్యమంత్రి .. ఇలా గవర్నర్ పై ఆరోపణలు చేయడం మంచి సంప్రదాయం కాదు.

గవర్నర్‌పై చంద్రబాబు ఆరోపణలు సమంజసమేనా..?

గవర్నర్ డీజీపీతో మాట్లాడటం.. రాజ్యాంగ సంప్రదాయం కాదు. అలా అని ఆయనను కుట్రదారునిగా.. నిర్ణయించడం… కూడా రాజ్యాంగ రీత్యా మంచి సంప్రదాయం కాదు. గవర్నర్ తన అధికారాలను అతిక్రమించారని భావిస్తే.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేయవచ్చు. అప్పటికి స్పందించకపోతే కోర్టుకు పోవచ్చు. అంతే కానీ.. గవర్నర్‌కు నేరుగా డీజీపీకి ఫోన్ చేశారని రాజకీయపరమైన ఆరోపణలు చేయడం ముఖ్యమంత్రి స్థాయికి కరెక్ట్ కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.