కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో భారీ బహిరంగసభ నిర్వహిచింది. రామ్ లీలా మైదాన్ లో అన్ని రాష్ట్రాల నుంచి కార్యకర్తల్ని సమీకరించి రాహుల్ నుంచి రేవంత్ వరకూ అందరూ ఓటు చోరీపై చాలా పెద్ద పెద్ద ప్రసంగాలు చేశారు. ఎన్నికల సంఘంపై నిందలేశారు. అంతా బాగానే ఉంది.. కానీ రాజకీయాల్లో ప్రజలతో కనెక్షన్ లేని రాజకీయాలు చేస్తే ప్రయోజనం ఉండదు. ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజల్లో చర్చ జరగాలి. అలా జరగకపోతే.. ఆ వ్యూహం వల్ల ప్రయోజనమూ ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఓటు చోరీ ఉద్యమం అలాంటిదే.
బీహార్లో ఓటు చోరీ అంశం అసలు టాపిక్కే కాలేదు !
బీహార్ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఓటుచోరీ అంశంపై పెద్ద ఉద్యమమే చేశారు. పాదయాత్ర చేశారు. స్పెషలిస్ట్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా లక్షల ఓట్లు తీసేస్తున్నారని ప్రచారం చేశారు. కానీ ఇరవై ఏళ్ల పాటు సీఎంగా ఉన్న నితీష్ ను మాత్రం ఓడించలేకపోయారు. అంతకు ముందు ఎన్నికల కంటే ఘోరంగా ఓడిపోయారు. అక్కడ ఓటు చోరీ జరిగిందని గట్టిగా ఆరోపించలేకపోతున్నారు. ఎందుకంటే ఎన్నికల సంఘం తీసేసిన 70 లక్షల ఓట్లకు సంబంధించిన ఓటర్లు ఉన్నారని నిరూపించలేకపోయారు. అందుకే ..బీహార్ లో అసలు ఆ టాపిక్కే లేదు. ప్రజలు పట్టించుకోలేదు.
ఓటు చోరీ గురించి ఏ రాష్ట్రంలో ప్రజలు అయినా నమ్ముతున్నారా?
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటు చోరీ గురించి రెండు సార్లు హైడ్రోజన్ బాంబులేశారు. వాటిపై మీడియాలో విస్తృత చర్చ జరిగింది. కానీ ఆ ఓటు చోరీ నిజం అని ఒక్కరూ నిరూపించలేక పోయారు. ఓటర్ జాబితాలోని లోపాలను తీసుకు వచ్చి ఆయన చేసిన ప్రచారంగా ఎక్కువ మంది నమ్ముతున్నారు. నిజంగా ఓటు చోరీ జరిగిందో లేదో రాహుల్ నిరూపించలేకపోతున్నారు. తాము చూపించినవే సాక్ష్యాలంటున్నారు. కానీ ఓటర్ జాబితా గురించి కనీస అవగాహన ఉన్న వారంతా..కొత్తగా ఏముంది.. అంతా పాత విషయమేగా అనుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఆధార్, ఓటర్ అనుసంధానం తర్వాత చాలా వరకూ దొంగ ఓట్లు.. ఫేక్ ఓట్లు.. డబుల్ ఎంట్రీలు కూడా తగ్గిపోయాయి. అందుకే ప్రజలు నమ్మడం లేదు. ఏ రాష్ట్రంలోనూ .. ఓటు చోరీ అనేది ఎలక్షన్ పాయింట్ కాలేదు. చివరికి తెలంగాణలో కూడా.
ప్రజలతో టచ్ లేని రాజకీయాలు చేస్తే ప్రయోజనం ఏమిటి?
రాహుల్ గాంధీ రాజకీయం తాను గెలవడం లేదు కాబట్టి ఎన్నికల సంఘాన్ని నిందిస్తే సరిపోతుందంని అనుకుంటున్నారు. కానీ ఎన్నికల సంఘాన్ని తప్పు పడితే ఏమి వస్తుంది…? ఒకప్పుడు ఈవీఎంలను నిందించారు. ఇప్పుడు ఓట్ల చోరీ ఉంటున్నారు. దేంట్లోనూ రాహుల్ గాంధీ ప్రజలను నమ్మించే రాజకీయం చే్యలేకపోయారు. తప్పు ఎక్కడ జరుగుతుందో తెలిసి కూడా దిద్దుకోలేకపోతున్నారు. ఇక కాంగ్రెస్ మెరుగుపడేదెలా ?
