రాజశేఖర్ మెల్లమెల్లగా క్యారెక్టర్, నెగిటీవ్ పాత్రలపై దృష్టి పెడుతున్నారు. శర్వానంద్ కథానాయకుడిగా నటించిన ‘బైకర్’లో ఆయన ఇప్పుడు ఓ కీలక పాత్ర పోషించారు. బుల్లెట్ సునీల్ గా ఆయన కనిపించబోతున్నారు. ఈరోజు రాజశేఖర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బుల్లెట్ సునీల్ పాత్రని పరిచయం చేస్తూ.. చిత్రబృందం ఓ గ్లింప్స్ విడుదల చేసింది.
క్రికెట్ కి తప్ప, మరో క్రీడకు ఆదరణ లేని ఈ దేశంలో.. బైకర్‌గా ఎన్నో విజయాల్ని అందుకొన్న ఓ క్రీడాకారుడిగా రాజశేఖర్ కనిపించబోతున్నారు. ‘ఒపీనియనే కదా.. మారుద్దాం’ అనే డైలాగ్ తో.. బుల్లెట్ సునీల్ తాలుకూ బలాబలాలు, క్యారెక్టరైజేషన్ అన్నీ అర్థం అవుతున్నాయి. ఈ పాత్రకు సాయి కుమార్ డబ్బింగ్ చెప్పారు. దాంతో మరింత నిండుదనం వచ్చింది. బుల్లెట్ సునీల్ పాత్రకూ, ఈ సినిమాలో హీరో పాత్రకూ ఉన్న లింకేంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. ఏప్రిల్ 3న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ యేడాది శర్వానంద్ నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. ఈ సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో ఓ విజయాన్ని అందుకొన్నాడు శర్వా. రెండు నెలల వ్యవధిలో మరో సినిమాని రిలీజ్ చేసేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించింది. మెల్లమెల్లగా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టనున్నారు.
