ఈటీవీ విన్ సంస్థ నుంచి ఈమధ్య మంచి సినిమాలొస్తున్నాయ్. కంటెంట్ పరంగా స్ట్రాంగ్ గా ఉంది. ‘లిటిల్ హార్ట్స్’ అలానే వచ్చి సంచలనం సృష్టించింది. అది అల్లరి ప్రేమకథ. ఇప్పుడు ‘రాజు వెడ్స్ రాంబాయ్’ వస్తోంది. ఇది.. మనసుల్ని మెలిపెట్టే ప్రేమకథ. ‘నీదీ నాదీ ఒకే కథ’, ‘విరాటపర్వం’లాంటి సినిమాల్ని తెరకెక్కించిన దర్శకుడు వేణు ఉడుగుల ఈ చిత్రానికి షోరన్నర్ గా వ్యవహరిస్తున్నారు. అఖిల్ ఉద్దుమారి, తేజస్వీ రావు, చైతు జొన్నలగడ్డ ప్రధాన పాత్రధారులు. సైలు కంపాటి దర్శకుడు. వంశీ నందిపాటి నిర్మాత. 21న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈరోజు ట్రైలర్ వదిలారు.
తెలంగాణని ఓ పల్లెటూరులో రాజు, రాంబాయ్ మధ్య నడిచే ప్రేమ కథ ఇది. ఇంట్లో వాళ్లు ప్రేమని ఒప్పుకోవాంటే `కడుపు అవ్వాల్సిందే’ అనే అమాయకత్వం వీళ్లది. అన్నంత పని జరిగాక ఏమైందన్నదే కథ. ఓ వైపు ప్రేమించిన అబ్బాయి, మరోవైపు కనిపెంచిన తండ్రి అతి ప్రేమ మధ్య ఓ అమ్మాయి ఎలా నలిగిపోయిందో ఈ సినిమాలో చూపిస్తున్నారు. ‘ప్రేమకు ప్రేమే శాశ్వత శత్రువు’ అనే ట్యాగ్ లైన్ తో ఈ ట్రైలర్ మొదలైంది. ప్రేమ.. ప్రేమకు శత్రువు ఎలా అయ్యిందో.. ట్రైలర్ లోనే చూపించేశారు. ట్రైలర్ లో చాలా స్వీట్ మూమెంట్స్ ఉన్నాయి. వాటిలో అమ్మాయి చెప్పుల్ని అబ్బాయి తొడుక్కోవడం ఒకటి. చాలా మంచి థాట్ అది. క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. లవ్ స్టోరీకి క్లైమాక్స్ చాలా బలం. కదిలించే పతాక సన్నివేశాలు రాసుకొంటే.. ఈ సినిమా నిలబడిపోయినట్టే.
అఖిల్, తేజస్వీరావులకు ఇది తొలి సినిమా. అయితే ఆ ఫీలింగ్ ఎక్కడా రాకుండా నటించేశారు. ఈ సినిమా విడుదలైన తరవాత తప్పకుండా వీరి పేర్లు గట్టిగా వినిపించే అవకాశం ఉంది. సిద్దు జొన్నలగడ్డ సోదరు చైతు జొన్నలగడ్డ ఓ కీలక పాత్రలో కనిపించారు. ఆయన గెటప్ కూడా వెరైటీగా ఉంది. తన పాత్ర కూడా ఇంటెన్సిటీతో సాగేదే. ఈటీవీ విన్ పై సినీ అభిమానులకు నమ్మకాలు పెరుగుతున్న వేళ.. ఈ సినిమాపై కూడా వాళ్లు గట్టిగానే ఫోకస్ చేసే ఛాన్సుంది.
