ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026కు రాజ్యసభలో చారిత్రక ఆమోదం లభించింది. లోక్సభ ఆమోదం పొందిన మరుసటి రోజే, ఎగువ సభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందడం అమరావతి ప్రయాణంలో మైలురాయిగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు రాజ్యసభలో భారీ మద్దతు లభించింది. బిల్లుపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ కూడా అమరావతికి మద్దతు తెలపింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక శాశ్వత రాజధాని ఉండాల్సిన ఆవశ్యకతను బీఆర్ఎస్ సభ్యులు నొక్కి చెప్పారు. అయితే వైసీ మాత్రం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేసింది.
వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ బిల్లును రాజకీయ డ్రామా గా అభివర్ణించారు. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండటం వల్ల ఇతర ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని ఆయన వాదించారు. మరోవైపు, టీడీపీ ఎంపీలు అమరావతి కోసం రైతులు చేసిన త్యాగాలను వివరిస్తూ, రాష్ట్రానికి చట్టబద్ధమైన రాజధాని లభించడం ఐదు కోట్ల ఆంధ్రుల విజయం అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమాధానమిస్తూ, రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం మేరకే ఈ సవరణ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లు ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు వెళ్లనుంది. రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ గెజిట్ వెలువడటంతో అమరావతికి దేశ అత్యున్నత చట్టసభ ద్వారా తిరుగులేని చట్టబద్ధత లభిస్తుంది. 2024 జూన్ 2 నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమల్లోకి వచ్చినట్లు ఈ చట్టం పేర్కొంటుంది. ఈ చారిత్రక ఘట్టంతో అమరావతిపై నెలకొన్న అనిశ్చితికి పూర్తిగా తెరపడింది. ఇకపై ఏ ప్రభుత్వం వచ్చినా పార్లమెంట్ చట్టాన్ని కాదని రాజధానిని మార్చడం అసాధ్యం.
