ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఐటీ , ఎలక్ట్రానిక్స్ రంగాల విస్తరణ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త కళను తెచ్చింది. కేవలం తీర్థయాత్రా స్థలంగానే కాకుండా, ఇప్పుడు విద్యా , సాంకేతిక హబ్‌గా ఎదుగుతున్న తిరుపతిలో రేణిగుంట రోడ్ ,ఎయిర్పోర్ట్ కారిడార్ పెట్టుబడిదారులకు ప్రధాన ఆకర్షణగా మారాయి.
రేణిగుంట పరిసరాల్లో ఇప్పటికే డిక్సన్ , టీసీఎల్ , సెల్కాన్ వంటి దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తమ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. దీనికి తోడు కేంద్ర బడ్జెట్ 2026లో తిరుపతిని సెమీకండక్టర్ హబ్‌గా ప్రకటించడం, ఐటీఐఆర్ ప్రాజెక్టుల పురోగతి ఈ ప్రాంత రూపురేఖలను మార్చేస్తున్నాయి. ఐటీ నిపుణులు, ఇంజనీర్ల రాకతో ఇక్కడ నివాస గృహాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. రేణిగుంట విమానాశ్రయం నుండి నగరం వరకు ఉన్న రోడ్డు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఫేవరెట్ రెసిడెన్షియల్ జోన్‌గా మారింది.
గతంలో తిరుపతిలో కేవలం అపార్ట్మెంట్లు లేదా చిన్న ఇళ్లకే పరిమితమైన రియల్ ఎస్టేట్, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు , ప్రీమియం ప్లాట్ల వైపు మళ్లింది. ముఖ్యంగా రేణిగుంట, మల్లవరం పరిసరాల్లో సుమారు 40కి పైగా కొత్త గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఐటీ నిపుణులు భద్రత, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ వంటి ఆధునిక వసతులు కోరుకుంటుండటంతో బిల్డర్లు కూడా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ ప్రాజెక్టులను రూపొందిస్తున్నారు. గడచిన ఏడాది కాలంలో ఇక్కడ ప్రాపర్టీ ధరలు 15% నుండి 20% వరకు వృద్ధి నమోదు చేశాయి.
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం, రేణిగుంట రైల్వే జంక్షన్ ఉండటం ఈ ప్రాంతానికి అతిపెద్ద ప్లస్ పాయింట్. ఎయిర్పోర్ట్ రోడ్డును ఆనుకుని ఉన్న పద్మావతి నగర్, సెట్టిపల్లి, మంగళం వంటి ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఐఐటీ తిరుపతి శాశ్వత క్యాంపస్ కూడా ఇక్కడే ఉండటంతో విద్యా సంస్థల చుట్టూ కొత్త నివాస సముదాయాలు వెలుస్తున్నాయి. మెరుగైన రవాణా సౌకర్యాలు ఉండటం వల్ల ఉద్యోగులు ఆఫీసులకు చేరుకోవడం సులభతరమై, ఈ ప్రాంతంలో అద్దెలు కూడా గణనీయంగా పెరిగాయి.
