కొత్తపలుకులో ఏదో పదం వాడారని హైదరాబాద్ వచ్చి మరీ ధర్నాలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు సైలెంటుగా ఉన్నారు. నాలుగైదు రోజుల పాటు ధర్నాలు, హెచ్చరికలు,బెదిరింపులతో హోరెత్తించిన వారు ఇప్పుడు మాట మాత్రంగా కూడా ఆర్కేను విమర్శించడం లేదు. సాధారణంగా వైసీపీలో ఏం మాట్లాడాలన్నా.. ఏం చేయాలన్నా తాడేపల్లి నుంచి ఆదేశాలు రావాల్సిందే. ఆంధ్రజ్యోతిపై ధర్నాలు చేయాలని కొత్తపలుకు ప్రసారం అయిన మూడు రోజుల తర్వాత ఆదేశాలు రావడంతోనే వారు ధర్నాలు చేశారు. ఇప్పుడు మాట్లాడవద్దని చెప్పడంతోనే ఆపేశారు.
ఇప్పుడు ఎందుకు ఆర్కేపై విమర్శలు చేయవద్దని వైసీపీ తమ పార్టీ నేతలకు చెబుతోంది. కారణం ఒక్కటే కనిపిస్తోంది..అదే ఆర్కే బయటపెడతానన్న పాతికేళ్ల క్రితం నాటి సీక్రెట్. అదేమిటో ఎవరికీ తెలియదు. అది బయటపెడితే వివేకా హత్యకేసు కన్నా చాలా పెద్దదని కూడా ఆర్కే హింట్ ఇచ్చారు. తన జోలికి వస్తే దాన్ని బయటపెడతానని కూడా హెచ్చరించారు. ఆ కొత్త పలుకు బయటకు వచ్చాక.. మా సింగాన్ని బెదిరిస్తారా అని మరింతగా రెచ్చిపోవాల్సిన వైసీపీ నేతలు… ఏదో మంత్రం వేసినట్లుగా నోళ్లకు ప్లాస్టర్ వేసేసుకున్నారు.
ఆర్కే ఆ సీక్రెట్ ఏమిటో బయటపెడితే పరువు పోతుందన్న ఉద్దేశంతోనే ఆయన జోలికి వెళ్లవద్దని వైసీపీ అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. కానీ ఆర్కే ఇచ్చిన టీజర్ తో సోషల్ మీడియాలో ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. పాతికేళ్ల క్రితం అంటే జగన్ అప్పటికి రాజకీయాల్లోకి రాలేదు. ఎంపీగా కూడా లేరు. కానీ ఆయన వ్యవహారాలపై చాలా వివాదాలు వస్తూ ఉండేవి. ఆ సమయంలో ఏం చేశారో.. జగన్ కే తెలియాలి. ఆర్కేకే తెలియాలి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు మాత్రం నిజం కాకపోవచ్చు. అందుకే వైసీపీ నేతలు… ఇంకా కెలుక్కోవడం ఎందుకని సైలంట్‌గా ఉండిపోతున్నారు.
