రోడ్లపై గుంతలతో బెంగళూరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బద్నామ్ అయిపోయిందో కళ్ల ముందే ఉంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మేలుకోవడం లేదు. గత రెండేళ్లుగా రోడ్ల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది. హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి దారుణంగా మారుతోంది. ప్రతి రోడ్లు గుంతల మయం అవుతోంది. అవి కూడా అత్యంత ప్రమాదకరమైన గుంతలుగా మారుతున్నాయి. ఎంత మంది వాహనదారులు కింద పడి దెబ్బలు తగిలించుకుంటున్నారో లెక్కే లేదు. అక్కడ ప్రమాదం జరిగిందని తెలిసిన తర్వాత కూడా ఆ గుంతలు పూడ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అదే అసలైన విషాదంగా మారింది.
గుంతల వల్ల ప్రాణం పోతే అది ప్రభుత్వ హత్యే !
రోడ్ల మీద గుంత ఒక్క ప్రాణం తీసిందంటే.. సంబంధిత వ్యవహారాలు చూసే ఉద్యోగులే హత్య చేసినట్లుగా. హైదరాబాద్ లో కానీ.. తెలంగాణ మొత్తం కానీ రోడ్లన్నీ కొంత మంది పరిధిలో ఉంటాయి. వాటికి రిపేర్లు చేయించి చక్కని నిర్వహణ ఉండేలా చూడాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. వారికి కావాల్సిన నిధులను ప్రభుత్వం అందుబాటులో ఉంచాల్సిందే. అలా చేయకపోతే ప్రజా ప్రాణాలతో చెలగాట మాడినట్లే. చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో .. గుంత వల్లనే పెద్ద ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న టిప్పర్ గుంతలో పడటంతో డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడంతో బస్సు మీదకు వెళ్లిపోయింది.
అధికారుల చేతకాని తనానికి ప్రజల్ని శిక్షించడం ఘోరం !
అందుకే ఆ రోడ్డు గురించి చర్చ జరుగుతోంది. ఆ రోడ్డును జాతీయ రహదారిగా మార్చిన తర్వాత కూడా విస్తరించకుండా ఆపారు. దానికి కారణం చెట్లని.. మరొకటని చెబుతూ వస్తున్నారు. కానీ ప్రమాదాలు మాత్రం జరుగుతూనే వస్తున్నాయి హైదరాబాద్ తో పాటు ఇతర ఆర్ అండ్ బీ రోడ్లు కూడా దారుణంగా మారుతున్నాయి. రోడ్ల నిర్వహణ కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులన్నీ ఉచిత బస్సు పథకానికి మళ్లుతున్నాయి. అందుకే నిర్వహణ దారుణంగా తయారవుతోంది.
నిర్వహణ నిధులు పథకాల కోటా కాదు !
ఉచిత పథకాలకు వేరే బడ్జెట్ ను కేటాయించుకోవాలి కానీ.. మౌలిక సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం చేయకూడు. రాష్ట్ర ప్రజలకే కాదు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కూడా రోడ్లు చాలా ముఖ్యం. మౌలిక సదుపాయాలుంటేనే పెట్టుబడిదారులు వస్తారు. కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం ఇప్పుడు మేలుకుని పెద్ద ఎత్తున పనులు చేస్తోంది. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే .. రేవంత్ సర్కార్ ముందుగానే మేలుకుని రోడ్ల నిర్వహణ చేపట్టాల్సి ఉంది.
                                                
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
                                              
                                              
                                              
                                              
                                              