కొన్నిసార్లు సోషల్ మీడియా వ్యవహారం ‘అదిగో పులి… ఇదిగో తోక’ అన్నట్టుగా ఉంటుంది. అసలు విషయం ఒక్కటే అయినా, దానికి మసాలా తగిలించుకుంటూ అసలు సంగతి పక్కదారి పడిపోతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ కొత్త సినిమాకి అదే తంతు జరుగుతోంది.
బన్నీ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అదే సమయంలో ఇతర దర్శకుల కథలు కూడా వింటున్నాడు. తాజాగా మలయాళ దర్శకుడు, నటుడు బాసిల్ జోసెఫ్ బన్నీని కలిసి ఓ కథ చెప్పాడు. ఆ కథపై బన్నీ ఆసక్తి చూపించినప్పటికీ ఇంకా ఏమీ ఫైనల్ కాలేదు.
అయితే ఈ కథ గురించి సోషల్ మీడియాలో పెద్దగా రచ్చ జరుగుతోంది. బన్నీ “శక్తిమాన్” సినిమా చేయబోతున్నాడనే వార్తలు గాసిప్లుగా చక్కర్లు కొడుతున్నాయి. బాసిల్ జోసెఫ్ తెరకెక్కించిన ‘మిన్నల్ మురళి’ కూడా ఒక సూపర్‌హీరో కథ. అతను బన్నీ కోసం భారీ స్కేల్లో మరో సూపర్‌హీరో కథ రెడీ చేస్తున్నాడని ఇంకొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
కానీ ఇవన్నీ ఊహాగానాలే. “శక్తిమాన్” 90లలో దూరదర్శన్‌లో ప్రసారమైన పాపులర్ సీరీస్. ఇది సూపర్మాన్ తరహా కథ. ‘మిన్నల్ మురళి’ కూడా అదే జోనర్లోకి వస్తుంది. బాసిల్ అలాంటి సూపర్ మ్యాన్ కథ తయారుచేసి ఉండవచ్చు గానీ, ఆయన రాస్తున్న కథకు, ముఖేష్ ఖన్నా నటించిన ‘శక్తిమాన్’ సీరీస్‌కు ఎలాంటి సంబంధం లేదు.