రివ్యూ: జవాన్

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5

మైండ్ గేమ్… చాలా చిన్న మాటే. దీని చుట్టూ సినిమా తీయాలంటే మాత్రం చాలా కష్టపడాలి. ఎత్తుకు పై ఎత్తులు వేసే సన్నివేశాలు… లాజిక్ మిస్ అవ్వకుండా చూసుకుంటూ, ఒకవేళ మిస్ అయినా, ఆ ఆలోచనే ప్రేక్షకుడికి రాకుండా చూసుకుంటూ కథని పకడ్బందీగా నడిపించాలి. ధ్రువ లా అన్నమాట. సరిగ్గా అలాంటి ప్రయత్నమే చేశాడు దర్శకుడు బి. వి.ఎస్ రవి. రచయితగా అనుభవం సంపాదించుకున్న రవి.. వాంటెడ్ తో దర్శకుడు అయ్యాడు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ సారి దర్శకుడిగా నిరూపించుకోవాలంటే హిట్ కొట్టాల్సిందే. అలాంటి పరిస్థితిలో పక్కా కమర్షియల్ ఎంచుకోకుండా మైండ్ గేమ్ నేపథ్యంలో కథ ఎంచుకోవడం మంచి ఆలోచనే. మరి ఈ కథ ని ఎలా తెరకెక్కించాడు? రవి ఈ సారైనా పాస్ అయ్యాడా? ‘జవాన్’ జాతకం ఎలా ఉంది?

* కథ

జై (సాయిధరమ్), కేశవ్ (ప్రసన్న) ఇద్దరూ స్నేహితులు. జై నిజాయితీగా ఉంటాడు. కేశవ్ కి స్వార్ధం ఎక్కువ. ఇద్దరి దారులు వేరు. అందుకే చిన్నప్పుడే విడిపోతారు. జై కి డి. ఆర్.డి లో పనిచేయాలన్నదే లక్ష్యం. అందుకోసం కష్టపడుతుంటాడు. కేశవ్ దేశ ద్రోహులతో చేతులు కలుపుతాడు. డి.ఆర్.డి లోని ఆక్టోపస్ అనే మిస్సైల్ ని దొంగిలించి దేశద్రోహులకు అమ్మాలన్నది అతని ఆలోచన. దాన్ని జై ఎలా తిప్పికొట్టాడు? జై. కేశవ మధ్య ఎలాంటి పోరు సాగింది? అనేదే కథ.

* విశ్లేషణ

హీరో, విలన్లు ఇద్దరూ బలవంతులే ఐతే వాళ్ళ మధ్య మైండ్ గేమ్ సెట్ చేస్తే ఎలా ఉంటుంది??? అనేది ‘జులాయి’, ‘ధ్రువ’ లాంటి సినిమాల్లో చూశాం. దాదాపుగా ‘జవాన్’ ఫార్మెట్ కూడా అదే. హీరో, విలన్ ల కామన్ గోల్…. ఆక్టోపస్. దాన్ని లాక్కోవలన్నది ప్రతినాయకుడి లక్ష్యం. తనకి చిక్కకుండా చూడడం హీరో ప్రయత్నం. దానికి తగిన ఫ్లాట్, ఇద్దరి మధ్య మైండ్ గేమ్ సీన్స్ అన్ని చక్కగా రాసుకున్నాడు దర్శకుడు. రచయిత దర్శకుడైతే ప్రయోజనం ఇదే. ప్రతి పాత్రకు న్యాయం చేయాలని ప్రయత్నిస్తాడు. జవాన్ విషయంలో అదే జరిగింది. హీరోని తీసుకొచ్చి, విలన్ ఇంట్లో పెట్టడం అనేది అరిగిపోయిన ఫార్ములా. ఇక్కడ… విలన్ ని తీసుకొచ్చి హీరో ఇంట్లో పెట్టాడు. తన శత్రువుని ఇంట్లో ఉంచుకుని ప్రపంచమంతా వెదికేస్తాడు. విలన్ హీరోకి ఎప్పుడు దొరుకుతాడా అని ప్రేక్షకులు కూడా ఎదురుచూసేలా చేసాడు.

విలన్ ప్రయత్నాన్ని హీరో తప్పకుండా అడ్డుకుంటాడాని తెలుసు. కానీ ఎలా??? అనేదే ప్రధానం. దానిని ఆసక్తిగా చెప్పగలిగితేనే ఇలాంటి కథలు సక్సెస్ అవుతాయి. ఈ విషయంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు. ఆక్టోపస్ ని విలన్ కి దక్కకుండా హీరో చేసే ప్రయత్నం, విశ్రాంతి ఘట్టం ముందు తన కుటుంబాన్ని కాపాడుకున్న సన్నివేశాలు రక్తి కట్టాయి. ద్వితీయార్థంలో హీరో, విలన్ మైండ్ గేమ్ మొదలవుతుంది. ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి… తన తెలివితేటలని చూపించే సందర్భం సృష్టించుకున్నాడు దర్శకుడు. దాన్ని పర్ఫెక్ట్ గా తెరకెక్కించగలిగాడు కూడా. శత్రువు ఎవరో తెలుసుకోవడానికి వేసిన ప్లాన్ ఇంకెంత ఇంటిలిజెంట్ గా ఉంటుందో అనుకుంటే దాన్ని తేల్చేశాడు. క్లైమాక్స్ విషయంలో కూడా హడావిడి పడిపోయాడు. సినిమా మొత్తం తన ఇంటిలిజెన్స్ చూపించడానికి తహతహలాడిన దర్శకుడు చివరికి వచ్చేసరికి బాంబ్ బ్లాస్ట్ అంటూ మరీ రొటీన్ వ్యవహారాలలో పడిపోయాడు. కథ కి స్పీడ్ బ్రేకుల్లా వచ్చి విసిగించే పాటలు మరో ప్రధానమైన మైనస్. సినిమా అంతా సీరియస్ టెంపోలో సాగడం, వినోదానికి స్కోప్ లేకపోవడం ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.

* నటీనటులు

సాయి ధరమ్ మరోసారి ఎనర్జిటిక్ పెరఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. తనదైన అల్లరి మిస్ అయినా, ఈ కథ కి తగ్గట్టు బాధ్యతాయుతమైన కుర్రాడిగా ఒదిగిపోయాడు. విలన్ ముందు… తన కుటుంబం, దేశం గురించి చెప్పేటప్పుడు సాయి నటనలో మరింత పరిణతి కనిపించింది. ప్రసన్న ఆకట్టుకున్నాడు. కళ్ళతో క్రూరత్వం ప్రదర్శించాడు. హీరో.. విలన్ ల మధ్య సంభాషణ ఫోన్ ల మధ్యే సాగింది. దాంతో… ప్రసన్న నటనా ప్రతిభ పూర్తిస్థాయిలో చూసే అవకాశం రాలేదు. మెహరీన్ ఈ సారీ గ్లామర్ కే పరిమితం అయ్యింది. మరీ లావుగా కనిపించింది. మిగిలిన వారికి చెప్పుకోదగ్గ పాత్రలు పడలేదు.

* సాంకేతికత

కథ, కథనాలను పకడ్బందీ గా రాసుకున్నాడు దర్శకుడు. హీరో, విలన్ పాత్రల్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. స్వతహాగా రచయిత కాబట్టి, సంభాషణలు బాగా రాసుకున్నాడు. ఓవర్ డోస్ కి పోకుండా నీట్ గా ఉన్నాయి డైలాగులు. తమన్ ఏమి మారలేదు. అదే వాయింపు. పాటలు కథకి అడ్డుపడ్డాయి. అయితే నేపధ్య సంగీతం లో మాత్రం తన మార్కు చూపించాడు. ఫోటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు: రొటీన్ సినిమాల మధ్య జవాన్ కాస్త కొత్తగానే ఉంటుంది. దేశభక్తి అనే పాయింట్ కి కమర్షియల్ అంశాలు జోడించి దానికి మైండ్ గేమ్ మిక్స్ చేశాడు. క్లైమాక్స్ విషయం లో ఇంకాస్త కొత్తగా ఆలోచిస్తే బావుండేది.

*ఫైనల్ టచ్: జవాన్…. ధ్రువ 2

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.