మనకున్న అతి కొద్దిమంది స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. తన పేరు, పోస్టర్ పై బొమ్మ చూసి టికెట్లు కొనే అభిమానులు ఉన్నారు. సోలోగానూ సినిమా లాగించేయగల స్టామినా ఉంది. స్టార్ హీరోల పక్కన నటించగలదు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలూ చేయగలదు. తనకు భాషతోనూ పెద్దగా ఇబ్బంది లేదు. అలాంటి సమంత కొన్నాళ్లుగా డౌన్ ఫాల్ లో ఉంది. వ్యక్తిగత జీవితం, వృత్తిగతం రెండూ.. ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కానీ… తన వంతు పోరాటం తాను చేస్తూనే ఉంది. లేడీ ఓరియెంటెడ్ ట్రెండ్ లో సమంత చేసిన శాకుంతలం, యశోద ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. శాకుంతలం అయితే డిజాస్టర్. ఆ తరవాత పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలూ తగ్గాయి. ఈ నేపథ్యంలో నిర్మాతగానూ మారింది. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ రూపంలో తనకో మంచి ఛాన్స్ వచ్చింది. రాజ్ నిడిమోరు నిర్మాణంలో రూపొందిన సినిమా ఇది. నందినిరెడ్డి దర్శకత్వం వహించారు. మే 15న ఈ సినిమా రాబోతోంది. దర్శకురాలిగా నందిని రెడ్డికి కూడా ఈ సినిమా చాలా కీలకం. ఎందుకంటే తనకూ ఈమధ్య ఫ్లాపు పడింది. దాన్నుంచి బయటపడాలంటే తన మార్క్ చూపించాలి.
సమ్మర్లో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం పెద్ద కష్టమేం కాదు. సినిమాలో మేటర్ ఉంటే చాలు. `మా ఇంటి బంగారం` టీజర్ ఆకట్టుకొంది. మే 15న సమంతకు పెద్ద పోటీ కూడా లేదు. కాకపోతే ఇది సరిపోదు. పబ్లిసిటీని గట్టిగా ప్లాన్ చేసుకోవాలి. ఈమధ్య ప్రమోషన్లు చేసిన సినిమాలే.. పెద్దగా ఇంపాక్ట్ చూపించడం లేదు. అలాగని సినిమాని గాలికి వదిలేయలేరు. సంప్రదాయ పద్ధతుల్ని పక్కన పెట్టి, ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే టెక్నిక్స్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సమంత ఈ సినిమాతో గట్టిగా కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకొంటోంది. పైగా సొంత నిర్మాణంలో రూపొందిన సినిమా. కాబట్టి.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో మీడియా ఇంట్రాక్షన్లకు సమంత దూరంగా ఉండేది. వ్యక్తిగత ప్రశ్నలు అడిగి, సినిమా ప్రమోషన్లకు రాంగ్ రూట్ పట్టిస్తారని భయపడింది. ఇప్పుడు ఆ బెంగ లేదు. రాజ్ నిడిమోరుతో పెళ్లి చేసుకొని, తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించింది. కాబట్టి పాత గాయాల్ని మర్చిపోయి.. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నించాల్సిన సమయం ఉంది. కాబట్టి భయాలు, బెంగలూ పక్కన పెట్టి రంగంలోకి దూకాల్సిందే.
ఈసారి ఏ చిన్న తప్పు చేసినా.. అది సమంత కెరీర్ పై గట్టి ప్రభావం చూపిస్తుందనడంలో సందేహం లేదు. అందుకే సమంత ఇంకా జాగ్రత్తగా ఉండాలి.
