తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపునకు రంగం సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత శనివారం తన నూతన పార్టీ పేరు, విధివిధానాలను ప్రకటించబోతున్నారు. ఇందు కోసం భారీ ఏర్పాట్లు చేశారు. డటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ కొత్త పార్టీ లక్ష్యం ఇతర ప్రత్యర్థులు కాదని, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకును కొల్లగొట్టడమే. కవితకు వచ్చే ప్రతి ఓటు బీఆర్ఎస్ నుంచే వస్తుందని, ఆమెకు కూడా ఈ విషయంపై పూర్తి స్పష్టత ఉంది.
బీఆర్ఎస్ కేడరే టార్గెట్
కవిత ప్రకటించబోయే పార్టీ విధానాలు, చేరికలు అన్నీ బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచే దిశగానే సాగుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీలో అసంతృప్తిగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని, తనతో గతంలో కలిసి పనిచేసిన కేడర్‌ను తనవైపు తిప్పుకోవడం ద్వారా బీఆర్ఎస్ పునాదులను కదిలించాలని ఆమె వ్యూహరచన చేస్తున్నారు. శనివారం జరగబోయే బహిరంగ సభలో బీఆర్ఎస్ వైఫల్యాలను, ప్రస్తుత నాయకత్వ ధోరణిని ఎండగట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
రాజకీయాల్లోకి వచ్చాక నో సెంటిమెంట్స్
రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే ఒక్కోసారి సొంత మూలాలనే టార్గెట్ చేయాల్సి వస్తుందన్న సూత్రాన్ని కవిత అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తెలంగాణ సెంటిమెంట్ , క్యాడర్ బలాన్ని తన కొత్త పార్టీకి మళ్లించుకోగలిగితేనే ఆమె రాజకీయ భవిష్యత్తు నిలబడుతుంది. అందుకే ఏమాత్రం మొహమాటం లేకుండా, బీఆర్ఎస్ ఓటు బ్యాంకునే తన పార్టీకి ప్రాతిపదికగా మార్చుకోవాలని ఆమె కృతనిశ్చయంతో ఉన్నారు. చేరికల విషయంలో కూడా బీఆర్ఎస్ మాజీ నేతలే ప్రాధాన్యత ఇస్తున్నారు.
కవిత పార్టీ బీఆర్ఎస్కు పెనుసవాల్
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ బలమైన శక్తులుగా ఉండటంతో, కవిత కొత్త పార్టీ వల్ల బీఆర్ఎస్ పార్టీకి జరిగే నష్టమే ఎక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత పార్టీకి పడే ప్రతి ఓటు బీఆర్ఎస్ ఖాతాలో నుంచి తగ్గేదే కావడంతో, ఇది అంతిమంగా గులాబీ పార్టీకి శరాఘాతంగా మారనుంది. తండ్రి నీడ నుంచి బయటకు వచ్చి, సొంత పార్టీ ద్వారా బీఆర్ఎస్ను సవాల్ చేయడం అనేది తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం కానుంది.
