ఖల్‌నాయక్‌కు మతాన్ని ముడిపెట్టడం దౌర్భాగ్యం!

బాలీవుడ్‌ ఖల్‌నాయక్‌ సంజయ్‌దత్‌ ఎరవాడ జైలు నుంచి విడుదల అయ్యారు. దీని మీద చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఇంతా కలిపి ఆయనకు 60 నెలల శిక్షాకాలంలో ఆయనకు తగ్గినదెల్లా 8 నెలల శిక్ష మాత్రమే. మరోవైపు సత్ప్రవర్తన పేరుతో ఏళ్లకు ఏళ్ల శిక్షను కూడా మినహాయించుకుని ప్రభుత్వాల దయతో.. బయటకు వచ్చేసే ఖైదీలు చాలా మందే ఉంటూ ఉంటారు. కానీ సంజయ్‌దత్‌ దేశవ్యాప్తంగా సెలబ్రిటీ గనుక.. ఆయన 8 నెలల ముందు విడుదల అయినప్పటికీ.. దానికి సంబంధించిన చర్చ ఎక్కువగా జరుగుతోంది.

సంజయ్‌ దత్‌ కాంగ్రెసు పార్టీకి చెందిన వ్యక్తి అనుకోవాలి. ఆయన కుటుంబం ఆ పార్టీ రాజకీయాల్లో కీలకంగానే ఉంది. పార్టీ లు ఏదైనప్పటికీ.. రాజకీయాల్తో ప్రమేయం ఉన్న కుటుంబం వారిది. అరెస్టు అయిన తర్వాత.. ఆయన పెరోల్‌ మీద బయటకు వచ్చిన సందర్భాలు కూడా రాజకీయ ప్రేరేపితాలుగానే అప్పట్లో విమర్శలు ఎదుర్కొన్నాయి. అలాగే ఇప్పుడు సత్ప్రవర్తన పేరుతో విడుదల కావడం కూడా రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే జరిగందనే వారు చాలా మందే ఉన్నారు.

కానీ చాలా అసహ్యమైన రీతిలో సంజయ్‌ దత్‌ విడుదలను మతానికి ముడిపెట్టే ప్రయత్నం కూడా ఈ దేశంలో జరుగుతూ ఉండడం దౌర్భాగ్యం. మతం పేరిట దేశంలో ఒక సమిధ వేసి ఆజ్యం జత చేయడానికి సిద్ధంగా ఉండే, సదా అలాంటి వ్యాఖ్యలతో వివాదాస్పద వ్యక్తిగా వార్తలో నిలుస్తూ ఉండే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీనే ఈ వ్యాఖ్యలు కూడా చేయడం విశేషం.

ఇది ఎలా జరిగిందంటే..

‘బాంబుపేలుళ్ల నిందితులందరూ జీవితకాల శిక్ష ఎదుర్కొంటూ ఉంటే.. సంజుబాబా మాత్రం విడుదల అయ్యారు. ఇది వంచన’ అంటూ రాణా అయూబ్‌ అనే ఒక జర్నలిస్టు ఒక ట్వీట్‌ చేశారు. నిజానికి బాంబుపేలుళ్ల నిందితులకు, సంజయ్‌ దత్‌ కు ఒకటే సూత్రం వర్తిస్తుందని సదరు జర్నలిస్టు ఎలా భావించారో.. తర్వాతి సంగతి. ఈ ట్వీట్‌కు ప్రతిస్పందనగా ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఒక కామెంట్‌ చేస్తూ.. ”సంజయ్‌ దత్‌ పేరు సిద్దిఖీ బాబా అయితే ఏమయ్యేది? మతపరమైన చర్యలకు దారితీసేది” అంటూ ట్వీట్‌ చేశారు.

సంజయ్‌దత్‌ విషయంలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయేమో గానీ.. ఆయన హిందువు గనుక విడుదల చేశారని, ముస్లిం అయితే వేధించేవారని అర్థం వచ్చేలా అసదుద్దీన్‌ వ్యాఖ్యానించడం మరీ దౌర్భాగ్యం. తాజాగా గ్రేటర్‌ ఎన్నికల్లో మజ్లిస్‌ రౌడీలు రోడ్లమీద రెచ్చిపోతే.. ఏం చేయలేక చేతులుముడుచుకు కూర్చున్న పోలీసులు ఉన్న నగరం మనది. అలాంటి స్వేచ్ఛను అనుభవిస్తూ.. అసదుద్దీన్‌.. సంజూ విషయంలో కూడా మతం కోణాన్ని రచ్చకు లాగడం మాత్రం భావ్యం కాదని పలువురు భావిస్తున్నారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com