భారతదేశంలో కుటుంబ వ్యవస్థల్లో వస్తున్న మార్పులు, పెరుగుతున్న ఆయుర్దాయం కారణంగా సీనియర్ లివింగ్ విభాగం రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఆశా కిరణంగా మారుతోంది. గతంలో వృద్ధాశ్రమాలను చిన్నచూపు చూసిన సమాజం, ఇప్పుడు గౌరవప్రదమైన, స్వతంత్రమైన, భద్రతతో కూడిన రిటైర్మెంట్ కమ్యూనిటీల వైపు మొగ్గు చూపుతోంది.
2030 నాటికి దేశంలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 20 కోట్లకు చేరుతుందన్న అంచనాల మధ్య, ఈ రంగం 2026లో సరికొత్త పెట్టుబడులకు వేదికవుతోంది. ముఖ్యంగా ఆర్థికంగా స్వతంత్రంగా ఉండే వృద్ధులు, తమ శేష జీవితాన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో గడపడానికి ఈ ప్రత్యేక ప్రాజెక్టులను ఎంచుకుంటున్నారు.
ఈ విపరీతమైన డిమాండ్‌ను గుర్తించిన ప్రముఖ సంస్థలు వేల కోట్ల పెట్టుబడి ప్రాజెక్టులను ప్రకటిస్తున్నాయి.
సీనియర్ లివింగ్ ప్రాజెక్టుల్లో కేవలం నివాసాలే కాకుండా, 24/7 వైద్య సేవలు, ఫిజియోథెరపీ, పోషకాహార నిపుణులు , అత్యవసర స్పందన వ్యవస్థలు వంటి ప్రత్యేక సదుపాయాలు ఉండనున్నాయి. కేవలం అమ్మకాలకే పరిమితం కాకుండా, నెలకు రూ. 50,000 నుండి రూ. 75,000 అద్దెతో కూడిన అసిస్టెడ్ లివింగ్ మోడళ్లను కూడా సంస్థలు ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నాయి.
దక్షిణ భారతదేశం ప్రస్తుతం ఈ విప్లవానికి కేంద్రబిందువుగా నిలుస్తోంది, దేశంలోని మొత్తం సీనియర్ లివింగ్ ప్రాజెక్టుల్లో 60శాతం ఇక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి. అయితే ఈ సీనియర్ లివింగ్ ప్రస్తుతం బాగా ఆర్థికంగా ఉన్నత స్థాయిలోఉన్న వారికే అందుబాటులో ఉన్నాయి. రానురాను మధ్యతరగతి ప్రజలకూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
