ఎందుకో 2025 టాలీవుడ్ విజయ యాత్ర అనుకొన్నంత సజావుగా సాగడం లేదు. సంక్రాంతి సీజన్ లో కనిపించిన ‘విక్టరీ’… మధ్యమధ్యలో అరకొర విజయాలు మినహాయిస్తే చాలా ఎదురు దెబ్బలు తిగిలాయి. పెద్ద సినిమాలు రిలీజ్ డేట్లు వాయిదా వేసుకొన్నాయి. జనాల మూడ్.. మైండ్ సెట్ పూర్తిగా మారిపోయాయి. ధియేటర్ల వరకూ రావడం తగ్గించేశారు. ఈ దశలో బాక్సాఫీసు ఏమైపోతుందో, నిర్మాతల పరిస్థితి ఏమిటో అనే ఆందోళన మొదలైంది. ఇలాంటి సమయంలో సెప్టెంబరు విజయాలు చిత్రసీమకు భారీ ఊరట కలిగించాయి. లిటిల్ హార్ట్స్ లాంటి చిన్న సినిమా, ఓజీ లాంటి భారీ సినిమా విజయాల బాట పట్టడంతో.. నిర్మాతలకు కొండంత భరోసా కలిగింది. మధ్యలో ‘మిరాయ్’ కూడా మిరాకిల్ చేసింది. ‘కిష్కిందపురి’ ఊహించని రీతిలో తేరుకొని విజయ బావుటా ఎగరేసింది.
ఈ సెప్టెంబరులో జరిగిన మిరాకిల్ ఏమిటంటే… ‘లిటిల్ హార్ట్స్’ అనే చిన్న సినిమా మంచి విజయాన్ని అందుకోవడం. ఈటీవీ విన్ నుంచి వచ్చిన మూవీ ఇది. 2.5 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన సినిమా. స్టార్లు లేరు. టెక్నీషియన్లలో పేరున్న వాళ్లు కనిపించలేదు. కానీ బాక్సాఫీసు దగ్గర ఆదరణకు మాత్రం కొదవ రాలేదు. దాదాపు రూ.25 కోట్ల షేర్‌తో… ఇండస్ట్రీ జనాల దృష్టి మొత్తాన్ని తన వైపు తిప్పుకొంది. సినిమా రిలీజ్ తరవాత.. ఈ సినిమాలో పాలు పంచుకొన్న ప్రతీ ఒక్కరూ బిజీ అయిపోయారు. అంత ప్రభావం చూపించింది లిటిల్ హార్ట్స్. ఈ ప్రేరణతో ఇప్పుడు దాదాపు పాతిక సినిమాలు పురుడుపోసుకొంటున్నాయి. అంతటి ఇంపాక్ట్ ఇచ్చిన సినిమా ఇది. యేడాదికి కనీసం ఇలాంటి సినిమాలు నాలుగు హిట్టయినా చాలు. చిన్న సినిమా పురోగతి మరోలా ఉంటుంది.
‘హనుమాన్’తో తేజా సజ్జా తన ప్రతాపం చూపించాడు. సంక్రాంతి సీజన్ లో వచ్చి, పెద్ద సినిమాలు ధీటుగా నిలబడి రూ.300 కోట్లు వసూలు చేసింది. ఆ తరవాత తేజా చేసిన సినిమా ‘మిరాయ్’. ఈ సినిమా కూడా రూ.200 కోట్లు సాధించి.. తేజాని మరో మెట్టు పైకి ఎక్కించింది. వీఎఫ్ఎక్స్ మాయాజాలం, దైవిక మైన అంశాల జోడింపు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. చిన్న పిల్లలు ధియేటర్ల వైపు అడుగులు వేయడానికి మెగ్గు చూపించారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే కంటెంట్ ఉంది. ఓవర్సీస్ లో కూడా వసూళ్లు దండిగా వచ్చాయి. వీఎఫ్ఎక్స్ నేపథ్యంలో రాబోయే సినిమాలకు ‘మిరాయ్’ కొత్త ఉత్సాహాన్ని అందించింది. ‘మిరాయ్’ తో పాటుగా విడుదలైన ‘కిష్కింధపురి’ కి మొదట్లో ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా అనూహ్యంగా పుంజుకొంది. బ్రేక్ ఈవెన్ అయ్యింది. నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టింది. బెల్లంకొండ కెరీర్‌కు కొత్త బూస్టప్ ఇచ్చిన మూవీగా నిలిచింది.
ఇక నెలాఖర్లో ‘ఓజీ’ తుపాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కల్యాణ్ నుంచి వస్తున్న సినిమా అంటే దానికి ఉండే హైప్ ఓజీ విషయంలో రెట్టింపు అయ్యింది. ప్రీమియర్లతోనే కొత్త రికార్డులు సృష్టించింది ఓజీ. పవన్ కల్యాణ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఓవర్సీస్ లో ఓజీ స్పీడు మామూలుగా లేదు. పండగ సెలవలు ఈసినిమాకు మరింత కలిసొచ్చాయి. కొత్తగా ఓ పాట కూడా చేర్చారు. దాంతో వసూళ్లు మరింత పెరిగే ఛాన్సుంది.
మొత్తానికి సెప్టెంబరు మాసం ఖుషీ ఖుషీగా సాగింది. నిర్మాతలకు భరోసా ఇచ్చింది. ఈ ఊపు మున్ముందు కూడా ఇలానే కొనసాగాలి. అక్టోబరులో కూడా మంచి సినిమాలు వస్తున్నాయి. నవంబరు, డిసెంబరు షెడ్యూల్ కూడా క్లియర్ గా ఉంది. పెద్ద సినిమాలు వరుస కట్టడానికి రెడీ అవుతున్నాయి. సెప్టెంబరు ఇచ్చిన కిక్.. రాబోయే మూడు మాసాల్లోనూ కనిపిస్తే 2025 ఆశాజనకంగా ముగిసే అవకాశం ఉంది.