శివాజీకి ’90’ వెబ్ సిరీస్ మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తరవాతే నటుడిగా బిజీ అయ్యాడు. కోర్ట్ సినిమాలో మంగపతి పాత్రతో కొత్త ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు తనకు క్రేజీ ఆఫర్లు అందుతున్నాయి. అందులో భాగంగా ‘సంప్రదాయినీ సుప్పిని సుద్దపూసని’ సినిమా పూర్తి చేశాడు. లయ కీలక పాత్రధారి. ఈటీవీ విన్ సౌజన్యంలో చేసిన సినిమా ఇది. టీజర్, ట్రైలర్లో మంచి క్వాలిటీ కనిపించింది. ముందు థియేటర్లలో విడుదల చేద్దామనుకొన్నారు. కానీ ఓటీటీకి షిఫ్ట్ అయ్యింది. ఈరోజు ఈటీవీ విన్ లో విడుదల కావాల్సిన సినిమా ఇది. అయితే చివరి క్షణంలో మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకొని, మళ్లీ థియేటర్లలోనే విడుదల చేయాలని ఫిక్సయ్యారు. మార్చి 6న రిలీజ్ చేసేప్రయత్నాల్లో ఉన్నారు.
చిన్న సినిమాలకు ఈమధ్య ఊహించని విజయాలు దక్కాయి. ముఖ్యంగా ఈటీవీ విన్ తమ సినిమాల్ని చాలా తెలివిగా ప్లాన్ చేసి, ప్రేక్షకులకు చేరువు చేస్తోంది. పబ్లిసిటీ విషయంలోనూ కొత్త పుంతలు తొక్కుతోంది. సినిమాకి మంచి టాక్ వస్తే చాలు.. జనాలు థియేటర్లకు వస్తారన్న భరోసా కల్పిస్తోంది. అందుకే ఈ సినిమానీ థియేటర్లలోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకొన్నారు. ఆఖరి క్షణంలో ఓటీటీ రిలీజ్ కి బ్రేక్ ఇచ్చారు. మార్చి 6 కూడా మంచి డేటే. పెద్ద సినిమాల పోటీ లేదు. పబ్లిసిటీ చేసుకోవడానికి కూడా వీలైనంత సమయం ఉంది. ఈరోజు థియేట్రికల్ రిలీజ్ గురించిన ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
