మహేష్ బాబు – రాజమౌళి సినిమా టైటిల్ ఏమిటి? పస్తుతం సినీ ప్రపంచాన్ని వెంటాడుతున్న బిలియన్ డాలర్ల ప్రశ్న ఇది. మొన్నటి వరకూ ‘వారణాసి’ అన్నారు. ఆ తరవాత ‘రుద్ర’ అనే మరో టైటిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు ‘సంచారి’ అంటున్నారు. ‘సంచారి’ పేరుతో ఓ పాట బయటకు రాగానే, ఆ పేరే ఈ సినిమాకు పెట్టి ఉంటారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. వారణాసి, సంచారి, రుద్ర.. వీటిలో మహేష్ సినిమా టైటిల్ ఏదైతే బాగుంటుందన్న ఆసక్తికరమైన చర్చ మహేష్ అభిమానుల్లో నడుస్తోంది.
ఇన్ని టైటిళ్లు బయటకు వచ్చినా, ఈ సినిమాపై ఇన్ని వార్తలు వినిపిస్తున్నా రాజమౌళి అండ్ టీమ్ ఎప్పటిలానే మౌనంగా వుంది. ‘కాదు’ అనడం లేదు. అలాగని ‘ఔను’ అని బలపరచడం లేదు. ఇదంతా రాజమౌళి కావాలని వేస్తున్న ఎత్తుగడలానే ఉంది. అభిమానుల్లో ఓ టైటిల్ బలంగా నాటకుపోయినప్పుడు మరో టైటిల్ బయటపెడితే సర్ప్రైజ్కి గురవుతారు. రాజమౌళి స్ట్రాటజీ కూడా ఇదే కావొచ్చు. ఇప్పుడు బయట వినిపిస్తున్న టైటిల్స్ ఏమీ ఈ సినిమాకు పెట్టడం లేదని, రాజమౌళి ఓ కొత్త టైటిల్ బయటకు తీసుకొస్తారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. వారణాసి, రుద్ర, సంచారి.. ఈ టైటిళ్లు బాగున్నా – రాజమౌళి సినిమా స్థాయిలో లేవన్నది వాస్తవం. పైగా గ్లోబల్ టచ్ రావడం లేదు.
ఈసారి రాజమౌళి టైటిల్ పూర్తిగా ఇంగ్లీష్ లో ఉంటుందని, అయినా అందరికీ అర్థమయ్యే రీతిలోనే పెట్టబోతున్నారని రాజమౌళి సన్నిహితులు ఊరిస్తున్నారు. వాళ్లందరి మాట ఒక్కటే.. `రాజమౌళి టైటిల్ కూడా సర్ప్రైజింగ్ గా ఉంటుంది` అని. పైగా అదెప్పుడో ఫిక్సయిపోయిందట. ఇన్నాళ్లుగా టైటిల్ ని దాచి పెట్టి ఉంచారంటే అది కూడా జక్కన్న పర్ఫెక్ట్ ప్లానింగ్ కి నిదర్శనం అని చెప్పుకోవాలి.

