దేశంలో మానవ అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు సెక్స్ వర్కర్ల హక్కుల రక్షణపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన, చారిత్రాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తిని ఎంచుకున్న మేజర్లను, బలవంతంగా ఈ రొంపిలోకి దింపిన బాధితులకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. స్వచ్చందంగా సెక్స్ వర్క్ ఎంచుకున్న వారిపై కేసులు పెట్టవద్దని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో భారతదేశంలో సెక్స్ వర్క్ చట్టబద్ధమైనదేనా? అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. భారతీయ చట్టాల ప్రకారం సెక్స్ వర్క్ నేరం కాదు, కానీ ఎన్నో పరిమితులు ఉన్నాయి.
లైంగిక వృత్తిలో ఉన్నారన్న కారణంగా వేధించడం చట్ట విరుద్ధం
న్యాయస్థానం తన మార్గదర్శకాల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ప్రధానంగా ప్రస్తావించింది. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ , గౌరవప్రదమైన జీవితం దేశంలోని ప్రతి పౌరుడికీ వర్తిస్తుందని, ఇందులో సెక్స్ వర్కర్లు మినహాయింపు కాదని తేల్చిచెప్పింది. కేవలం ఒక వ్యక్తి లైంగిక వృత్తిలో ఉన్నారనే ఏకైక కారణంతో వారిపై దాడులు చేయడం, వేధించడం, క్రిమినల్ కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని పోలీసు యంత్రాంగాన్ని కఠినంగా ఆదేశించింది. అలాగే, ఏ తల్లి నుంచైనా ఆమె వృత్తిని కారణం చూపిస్తూ బిడ్డను బలవంతంగా వేరు చేసే హక్కు ఎవరికీ లేదని కోర్టు స్పష్టం చేసింది.
అందరికీ ఆధార్ జారీ చేయాలి!
ఈ తీర్పులో అత్యున్నత న్యాయస్థానం మీడియాకు, చట్టబద్ధ సంస్థలకు కొన్ని కీలకమైన హెచ్చరికలు, ఆదేశాలు జారీ చేసింది. రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో లేదా దాడులు జరిగినప్పుడు సెక్స్ వర్కర్ల ఫోటోలు, వీడియోలను ప్రసారం చేయడం లేదా వారి గుర్తింపును వెల్లడించడం నేరమని పేర్కొంది. మరో ప్రధానమైన పరిణామం ఏమిటంటే, నివాస ధృవీకరణ పత్రాలు లేనప్పటికీ, సెక్స్ వర్కర్లందరికీ ప్రాథమిక పౌర హక్కుల కల్పనలో భాగంగా తక్షణమే ప్రభుత్వ గుర్తింపు కార్డులను జారీ చేయాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
స్వచ్ఛంద సెక్స్ వర్క్ నేరం కాదు కానీ..
ఈ తీర్పు ద్వారా సెక్స్ వర్క్ పూర్తిగా చట్టబద్ధమైనట్లు భావించలేము. ఎందుకంటే, మన దేశంలో ఒక వ్యక్తి స్వచ్ఛందంగా సెక్స్ వర్క్ చేసుకోవడానికి చట్టం అనుమతి ఇస్తున్నప్పటికీ.. బ్రోతల్ హౌ నడపడం, పబ్లిక్ స్థలాల్లో కస్టమర్లను ఆకర్షించడం , , మైనర్లను ఈ వృత్తిలోకి లాగడం వంటివి ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం ఇప్పటికీ తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. సుప్రీంకోర్టు తీర్పు సెక్స్ వర్క్‌ను పూర్తిగా ఒక వాణిజ్య వ్యాపారంగా చట్టబద్ధం చేయలేదు. కానీ, స్వచ్ఛందంగా ఈ వృత్తిలో ఉన్న వారికి పోలీసు వేధింపుల నుండి విముక్తి కల్పించి, వారిని నేరస్థులుగా చూడకుండా చట్టపరమైన రక్షణ కల్పించింది. వ్యవస్థ చేయాల్సింది స్వచ్ఛందంగా జీవించే వారిని వేధించడం కాదు, మహిళలను, బాలికలను బలవంతంగా అక్రమ రవాణా చేసే అసలైన మాఫియాపై ఉక్కుపాదం మోపడమేనని అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పు ద్వారా స్పష్టం చేసింది.
