కేంద్రానికి కెసిఆర్ లేఖ: అంతా పద్ధతి ప్రకారమే చేస్తున్నారు

kcr

ఉమ్మడి హైకోర్టు విభజనకి కెసిఆర్ అంతా ఒక పద్ధతి ప్రకారమే ముందుకు సాగుతున్నట్లున్నారు. ప్రభుత్వపరంగా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఉద్యమం ద్వారానే దానిని సాధించుకొనే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. అందుకే జిల్లా స్థాయి నుంచి చిన్నగా మొదలైన న్యాయవాదుల పోరాటం ఇప్పుడు రాష్ట్ర స్థాయికి వ్యాపించగలిగింది. ఇప్పుడు ఆయన డిల్లీలో దీక్ష చేస్తే జాతీయస్థాయికి వెళుతుంది. అంతకంటే ముందు ఆయన కేంద్ర హోం మంత్రి శాఖ, ఉద్యోగుల పదోన్నతులు, శిక్షణ శాఖలకి వేర్వేరుగా లేఖలు వ్రాసి తెలంగాణా న్యాయవ్యవస్థకి జరుగుతున్న అన్యాయం గురించి వివరించి, తక్షణమే చర్యలు చేపట్టాలని వ్రాశారు. అంటే ఈ విషయంలో కెసిఆర్ ఒక పద్ధతి ప్రకారమే ముందుకు సాగుతున్నట్లు అర్ధమవుతోంది. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం కూడా ఇలాగే మొదలయిన సంగతి గుర్తు చేసుకొంటే, ఇది కూడా దానిలాగే సఫలం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణా న్యాయవాదులు చేస్తున్న ఈ ఉద్యమం ఇంకా ఉదృతం అవడానికి న్యాయమూర్తుల సస్పెన్షన్, కేంద్ర న్యాయశాఖా మంత్రి సదానంద గౌడ తాజా వ్యాఖ్యలు మరింత దోహదపడ్డాయని చెప్పక తప్పదు. ఈ విషయంలో హైకోర్టు చట్టప్రకారమే నడుచుకొంది కనుక దానిని తప్పు పట్టలేము కానీ న్యాయశాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న సదానంద గౌడ ఈ ఉద్యమాన్ని చల్లార్చే ప్రయత్నం చేయకుండా తన మాటలతో ఇంకా రెచ్చగొట్టడం వలన ఇంకా వారు తమ ఉద్యమాన్ని ఉపసంహరించుకోకుండా చేసినట్లయింది.

ముఖ్యమంత్రి కెసిఆర్ పద్ధతి ప్రకారం కేంద్రానికి లేఖ వ్రాసి బంతిని కేంద్రప్రభుత్వ కోర్టులో పడేశారు. కనుక ఈ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదే. దానిపై కేంద్ర వైఖరి ఏమిటో సదానంద గౌడ నిన్ననే తేల్చి చెప్పేశారు కనుక కెసిఆర్ దీక్ష చేయడం అనివార్యంగానే కనిపిస్తోంది.

ముఖ్యమంత్రిగా ఉన్న కెసిఆర్ ధర్నా చేయడం సమర్ధించలేము కానీ ఒకసారి దీక్ష మొదలుపెడితే అనుకొన్న లక్ష్యాన్ని సాధించకుండా ముగిస్తే ఆయనే నవ్వులపాలయ్యే ప్రమాదం ఉంది. కనుక ఆయన మరికొంత కాలం వేచి చూడవచ్చు. ఈలోగా న్యాయవాదుల ఉద్యమం కూడా ఇంకా తీవ్రతరం అయితే కేంద్రంపై ఇంకా ఒత్తిడి పెరిగి దిగిరాక తప్పదు. ఆయన డిల్లీలో ధర్నా చేయబోతున్నారనే చిన్న మాటతోనే ప్రకంపనలు పుట్టించగలిగారు. నిజంగా ధర్నా చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో, ఏవిధమైన రాజకీయ పరిణామాలు ఏర్పడుతాయో ఊహించడం కష్టమే.

ఈ చిన్న ధర్నా వార్తని మీడియాకి లీక్ చేయడంతో మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యపై ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటాలు, తెలంగాణా ప్రాజెక్టులలో జరుగుతున్న అవినీతిపై అవి చేస్తున్న ఆరోపణలు, తెలంగాణా రాజకీయ జేయేసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శలు అన్నిటిపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించడంలో కెసిఆర్ సఫలం అయ్యారనే చెప్పవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com