ఇది కాంగ్రెస్‌ రగిలించిన రావణకాష్టమే!

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఇప్పుడు హైకోర్టు విభజన అనే అంశం తీవ్రమైన సంచలనాశంగా కనిపిస్తోంది. తెలుగురాష్ట్రం విడిపోయి రెండేళ్లు గడచిపోయాయి. ఏపీ సెక్రటేరియేట్‌ కూడా అమరావతికి తరలిపోతున్నది. ఏపీ మొత్తం విభజనకు అలవాటు పడిపోయిన వాతావరణమే ఉంది. ఆ నేపథ్యంలో హైకోర్టు విభజన గురించి హైదరాబాదు కేంద్రంగా తెలంగాణకు చెందిన న్యాయవాదులు, న్యాయాధికారులు చేస్తున్న ఉద్యమం గురించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చీమ కుట్టినట్లయినా లేదు. సాధారణంగా హైకోర్టు విభజన లాంటి ఏర్పాటు వలన ఉభయ రాష్ట్రాలకు కూడా కొన్ని ఎడ్వాంటేజీలు ఉండాలి. ఉంటాయి. కానీ ఇక్కడ కేవలం తెలంగాణకు మాత్రమే అన్యాయం జరుగుతున్నట్లుగా వారు మాత్రమే విభజన కోసం పోరాడుతున్నారు. అందువలన ఏపీ దీని గురించి పట్టించుకోకపోవడం సహజం. తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా కేంద్రానికి లేఖ రాయడం, పరిస్థితులు డిమాండ్‌చేస్తే ఢిల్లీలో తనే స్వయంగా దీక్ష చేయాలని అనుకుంటుండడం.. వంటివి వారి డిమాండు తీవ్రతరం కావడాన్ని తెలియజేస్తున్నాయి. న్యాయవ్యవస్థ పరంగా తెలంగాణ స్తంభించిపోతున్నది. దేశచరిత్రలో తొలిసారిగా న్యాయమూర్తుల సస్పెన్షన్‌ జరిగింది. తెలంగాణ న్యాయవ్యవస్థలో రావణ కాష్టం రగులుకున్నట్లుగానే కనిపిస్తోంది.

ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా నేపథ్యం మాత్రమే. ఇప్పుడు హైకోర్టు విభజన కోసం న్యాయవాదులు ఉద్యమిస్తున్నారు. రాష్ట్రంలోని తెరాస ప్రభుత్వం కూడా వారికి మద్దతుగానే ఉంది గనుక ఆ రెండు కోణాల్లోంచి మాత్రమే మనం ఈసమస్యను చూడడం జరుగుతోంది. తెరాసకు చెందిన పెద్దలు కేంద్రానికి విన్నవించడమూ, కేంద్రాన్ని బెదిరించడమూ జరుగుతోంది గనుక… కేంద్రమే ఈ విభజన విషయంలో నిర్లిప్త ధోరణి అవలంబిస్తున్నది అనిఅంతా అనుకుంటున్నారు. కానీ నిన్నటికి న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ పెదవి విప్పే వరకు వాస్తవాలు చాలా మందికి అర్థం కాలేదు.
హైకోర్టు విభజన కేంద్రానికి సంబంధించిన వ్యవహారం కాదు. అది రాష్ట్ర ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజే కలిపి తేల్చుకోవాల్సిన విషయం. ముఖ్యమంత్రులు విభజించాల్సిన హైకోర్టు కోసం వసతులు కల్పిస్తే.. ఆ ప్రక్రియ ఆ దశలోనే జరిగిపోతుంది తప్ప.. కేంద్రం జోక్యం చేసుకునేలా చట్టం చెప్పడం లేదు. కేసీఆర్‌ కు చట్టం తెలియకపోతే తెలుసుకోవాలి… అంటూ కేంద్ర న్యాయమంత్రి సదానంద గౌడ కాస్త వెటకారంగానే చురకలంటించారు.

ఈ పరిస్థితులు అన్నీ గమనించిన తర్వాత.. ఇంకాస్త లోతుగా ఈ సమస్య మూలాలను అన్వేషిస్తే.. చాలా ఇతర అంశాల మాదిరిగానే.. ఇది కూడా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కాంగ్రెస్‌ పార్టీ రగిలించిన రావణ కాష్టం అనే అభిప్రాయం కలగక మానదు. సదానంద గౌడ చెప్పిన చట్ట ప్రకారం విభజన అనేది.. సాధారణ పరిస్థితుల్లో సాధ్యంకావొచ్చు. కానీ తెలుగు రాష్ట్రం ఒకరకమైన పరస్పర అనుమానపూరిత వాతావరణంలో విడిపోయినప్పుడు.. ఈరెండు రాష్ట్రాల సయోధ్యతో మరో ఏర్పాటు జరుగుతుందని అనుకోవడం భ్రమ. ఇలాంటి చికాకుల్ని అంచనా వేసి, పసిగట్టి… విభజన చట్టాన్ని రూపొందించినప్పుడే.. అందులో రాష్ట్ర విభజన గురించి, పోలవరం ముంపు గ్రామాలను అప్పగించడంగురించి, ఎలాగైతే స్పష్టమైన నిబంధనలు తెలియజెప్పారో.. అదే మాదిరిగా.. హైకోర్టు విభజన గురించి కూడా అదే చట్టంలో పొందుపరచిఉంటే సరిపోయేది. కానీ.. ‘రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎన్నటికీ సహృద్భావ వాతావరణం ఏర్పడడం ఇష్టం లేదు’ అన్నట్లుగా కాంగ్రెస్‌ పార్టీ అనేక విషయాల్లో తగాదాలు ముదిరేలాగానే అవకతవకల మయంగా ఆ విభజన చట్టాన్ని తయారుచేసింది. అందులో ఈహైకోర్టు విభజన గురించి స్పష్టత ఇవ్వకపోవడం కూడా ఒకటి. కేంద్రం పట్టించుకుంటే పనిఅయిపోతుందని ఆరాటపడడంలో తప్పులేదు కానీ… అసలు మూలాల్లో ఇలాంటి వివాదాల చితిని పేర్చి పెట్టింది కాంగ్రెసు పార్టీనే అని కూడా జనం గుర్తించాలి.

తెలుగు రాష్ట్రం విభజన ద్వారా, పర్యవసానంగా రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెసు పార్టీ సర్వనాశనం అయిపోయింది. విభజన చట్టం రూపొందించినప్పుడు వారు పాల్పడిన ఇలాంటి వక్రనీతుల గురించి జనానికి ఇంకాస్త అవగాహన ఉంటే.. వారి వంచన రాజకీయంలో మార్పు రావడానికి అవకాశం ఉంటుందని ఆశించవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com