ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి బాధ్యతారాహిత్య ప్రకటనలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇటీవల తల్లుల పెంపకం సరిగ్గా లేకపోవడం వల్లే నేరాలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించి కలకలం రేపారు . ఇప్పుడు మరోసారి రేపిస్టులకు మద్దతుగా మాట్లాడారు., రేపల్లే రైల్వే స్టేషన్‌లో గర్భిణీపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారికి రేప్ చేసే ఉద్దేశం లేదట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఇన్వెస్టిగేట్ చేసి చెబుతున్నారు. గత నాలుగు రోజుల నుంచి రేపల్లే రైల్వే స్టేషన్‌లో జరిగిన అత్యాచారం ఘటన సంచలనాత్మకం అవుతోంది. బీహార్ కంటే దారుణంగా పరిస్థితులు దిగజారిపోయాయనని విమర్శలు వస్తున్నాయి.
ఇలాంటి సమయంలో బాధితురాల్ని ఆస్పత్రిలో ఉంచి ఎవర్నీ కలవ నీయడం లేదు. హోంమంత్రిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉన్న సమయంలో రేపిస్టులకు మద్దతుగా హోంమంత్రి మాట్లాడిన మాటలు కలకలం రేపుతున్నాయి. రేపిస్టుల ఉద్దేశం రేప్ కాదని… ఇంకేదో అని ఆమె చెబుతున్నారు. రైల్వే స్టేషన్‌లో దొంగతనం చేయబోయారు.. అడ్డుకున్నారు కాబట్టి అత్యాచారం చేశారని హోంమంత్రి చెబుతున్నారు.
ఏపీలో నేరస్తులకు భయం లేకపోవడం .. పోలీసులు రాజకీయ పార్టీలు.. కులాలు, మతాలు చూసి నేరస్తుల విషయలో సీరియస్‌గా లేకపోవడం వంటి కారణాల వల్ల నేరాలు పెరిగిపోతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో అత్యాచార నిందితుల ఉద్దేశం రేప్ కాదని.. మరొకటని హోంమంత్రి చెప్పడం ద్వారా వారిపై సానుభూతి చూపించినట్లయింది. ఇలాంటిప్రకటన వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో.. బాధ్యతాయుతమైన హోంమంత్రే నిర్ణయించుకోవాల్సి ఉంది.