తెలంగాణ ప్రభుత్వం విద్యారంగం కోసం ఏటా సుమారు రూ. 25,000 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తోంది. 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 18 లక్షల మంది విద్యార్థులను పరిగణనలోకి తీసుకుంటే, ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు సగటున లక్ష రూపాయలు దాటుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఆ విషయాన్నిఓ సభలో చెప్పారు. కానీ విద్యా ప్రమాణాలు మాత్రం మెరుగుపడటం లేదని ఆవేదన వ్యక్త చేశారు. అయితే ఆయన ఇలా చెప్పి వదలేయకూడదు.. సంస్కరణలపై సీరియస్ గా ఆలోచించాల్సి ఉంది.
లోపం ఎక్కడ ఉంది?
ఒక్క విద్యార్థిపై ప్రభుత్వం పెట్టే ఖర్చు ప్రముఖ కార్పొరేట్ పాఠశాలలు వసూలు చేసే ఫీజు కంటే ఎక్కువ. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇటీవల వెలువడిన గణాంకాల ప్రకారం, ఆరో తరగతి విద్యార్థుల్లో కేవలం 6.7 శాతం మంది మాత్రమే తమ తరగతి పుస్తకాలను చదవగలుగుతున్నారు. మిగిలిన 93 శాతం మంది కనీసం మూడో తరగతి స్థాయి చదువుకు కూడా నోచుకోలేకపోతున్నారు. ఈ వ్యత్యాసం ప్రజాధనం ఏ మేరకు వృథా అవుతోందో చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యం. ప్రభుత్వ పాఠశాలల్లో లోపం కేవలం నిధుల్లో లేదు, అది వ్యవస్థీకృత లోపం. కొన్ని పాఠశాలల్లో ఐదుగురు విద్యార్థులకు తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఉంటే, మరికొన్ని చోట్ల వందలాది మందికి ఒక్కరే దిక్కు. టీచర్-స్టూడెంట్ రేషియోలో ఉన్న ఈ అసంబద్ధత బోధన నాణ్యతను దెబ్బతీస్తోంది.
పేద పిల్లలకు ఫౌండేషన్ ఎలా?
ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి యూకేజీ వరకు ప్రీ-ప్రైమరీ తరగతులు లేకపోవడం మరో పెద్ద మైనస్. ప్రాథమిక దశలోనే ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు, ఆ తర్వాత ప్రభుత్వ బడుల వైపు చూడటం లేదు. దీనికి తోడు, టీచర్ల ట్రైనింగ్ కాలేజీలు కేవలం కాగితాలకే పరిమితం అవ్వడం, ఉపాధ్యాయులు బోధన కంటే బోధనేతర పనులకే ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం వంటివి నేర్చుకునే ప్రక్రియను నీరుగార్చుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రతీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 100 యంగ్ ఇండియా ఇంటెగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను నిర్మించాలని సంకల్పించింది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే చోట అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించడం దీని లక్ష్యం. అలాగే, 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రవేశపెట్టడం ద్వారా ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులను ప్రభుత్వ వ్యవస్థలోకి ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది ఒక రకంగా ప్రైవేట్ పాఠశాలల గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నమే.
మరిన్ని సంస్కరణలు రావాల్సిందే!
కేవలం భవనాలు నిర్మించి, నిధులు కేటాయిస్తే సరిపోదు. విద్యావ్యవస్థలో జవాబుదారీతనం పెరగాలి. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జరగాలి. ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండేలా చూడటంతో పాటు, వారి బోధనా సామర్థ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలి. ఏఐ ( వంటి సాంకేతిక విప్లవం ముంచుకొస్తున్న తరుణంలో, మన విద్యార్థులు కేవలం పుస్తకాలు చదవడమే కాదు, నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలి. లక్ష రూపాయల ఖర్చుకు తగిన ప్రతిఫలం లభించాలంటే, కేవలం చదువు మాత్రమే కాదు, నాణ్యమైన చదువు అందేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా, ఈ ఖర్చు వెనుక ఉన్న లెక్కలను సరిచూసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇష్టానుసారంగా ఖర్చు చేస్తూ ఫలితాలు రాకపోతే అది రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదం. రాజకీయాలకు అతీతంగా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చినప్పుడే, తెలంగాణ విద్యార్థులు గ్లోబల్ పోటీని తట్టుకొని నిలబడగలరు.


