ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లను వరుసగా విచారించిన సిట్ , ఇప్పుడు తన తదుపరి అడుగును మాజీ ఎమ్మెల్సీ కవిత దంపతుల వైపు వేస్తోంది. ఈ కేసుకు సంబంధించి కవిత , ఆమె భర్త అనిల్ కుమార్‌లకు త్వరలోనే నోటీసులు ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.అగ్రనేత కేసీఆర్‌ను నేరుగా ప్రశ్నించే కంటే ముందు, ఆ కుటుంబంలోని ఇతర కీలక సభ్యుల నుంచి సమాచారం సేకరించాలని భావిస్తోంది.
కవిత, ఆమె భర్త ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపణలు
ఇప్పటికే కవిత తన భర్త ఫోన్, తన లోకేషన్లను గత ప్రభుత్వంలో ట్యాప్ చేశారని పలుమార్లు బహిరంగంగానే ఆరోపించారు. వారిని బాధితులుగా లేదా సాక్షులుగా పరిగణించి వారి వాంగ్మూలాన్ని రికార్డు చేయడం కేసు దర్యాప్తులో కీలకం కానుంది. ప్రస్తుతానికి కవిత దంపతులను ఈ ట్యాపింగ్ వ్యవహారంపై అవగాహన ఉన్న సాక్షులుగా లేదా బాధితులుగా విచారించే అవకాశం కనిపిస్తోంది. ట్యాపింగ్ జరిగిన తీరు, ఆ సమయంలో వారు గమనించిన పరిణామాలు, వారి వ్యక్తిగత సమాచారం ఎలా ప్రభావితమైందనే కోణంలో సిట్ ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది.
రాధా కిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలమే కీలకం
మాజీ పోలీసు అధికారి రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్న చేతిరాత స్లిప్పుల వెనుక అసలు వ్యక్తులను గుర్తించే క్రమంలో ఈ విచారణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. హరీశ్ రావును గంటల తరబడి విచారించడం, ఆపై కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడం.. ఇప్పుడు కవిత దంపతుల వంతు రావడం తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. కేసీఆర్ కుటుంబ సభ్యులందరినీ విచారించిన తర్వాతే, చివరగా కేసీఆర్ వద్దకు విచారణను తీసుకెళ్లాలని సిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కుటుంబంలో ఫోన్ ట్యాపింగ్ చిచ్చు
కేసీఆర్ కుటుంబంలో ఫోన్ ట్యాపింగ్ చిచ్చు దావాలనంలా మారే అవకాశం కనిపిస్తోంది. ఏ ఉద్దేశంతో ఈ ట్యాపింగ్ చేయించారో కానీ ఒకరి మీద ఒకరికి అపనమ్మకం పెరిగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సిట్ విచారణలో ఫోన్ ట్యాప్ చేసినట్లుగా ఆధారాలు ఆయనకే చూపించారు. ఇప్పుడు కవితకూ చూపిస్తారు. రేపు ఇతర కుటుంబసభ్యుల్ని విచారణకు పిలిచినా చూపిస్తారు. అందుకే చట్టపరంగా ఈ కేసు ఎటు వెళ్తుందో కానీ.. కేసీఆర్ కుటుంబానికి మాత్రం చాలా చిక్కులు తెచ్చి పెట్టడం ఖాయంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
