ప్రణబ్‌ చర్చ వ్యర్థం- ద్రుపదికే ఛాన్సు

ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీనే మరోసారి ఎన్నుకోవాలని బీహార్‌ ముఖ్యమంత్రి నితిష్‌ కుమార్‌ చేసిన సూచనకు కాంగ్రెస్‌ సానుకూలంగా స్పందించిందని వార్తలు వస్తున్నాయి. ప్రణబ్‌కు ప్రధాని మోడీతో సత్సంబంధాలు వున్నాయి గనక ఒప్పుకోవచ్చన్న వూహలు కూడా కొందరిలో వున్నాయి. ఆయన కూడా ఏకగ్రీవంగా అయితే ఒప్పుకుంటానని చెప్పినట్టు సమాచారం. ఏ విధంగా చూసినా ఇదంతా కాలక్షేపానికి మాత్రమే పనికివచ్చే వ్యవహారం. రాజేంద్రప్రసాద్‌ తర్వాత ఇంతవరకూ రాష్ట్రపతి భవన్‌లో ఎవరికీ ఇవ్వని రెండవ అవకాశం పదహారణాల కాంగ్రెస్‌వాది ప్రణబ్‌కు మోడీ ఇస్తారనుకోవడం అమాయకత్వం. పైగా బిజెపి అచ్చంగా తమ అభ్యర్థిని అక్కడ ప్రతిష్టించుకోడానికి వచ్చిన తొలి అవకాశం ఇది. వాజ్‌పేయి హయాంలో స్వంతబలం చాలదు గనకనే ఉన్నంతలో తమకు అనుకూలమనుకున్న అబ్దుల్‌ కలాం అజాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుందామన్నారు. అప్పటికీ వామపక్షాలు బలపర్చలేదు.అందరూ నిలబెట్టిన దళిత నేత నారాయణన్‌ను శివసేన బలపర్చలేదు. నీలం సంజీవరెడ్డిని మినహాయిస్తే సాంకేతికంగా ఇంతవరకూ ఎవరూ ఏకగ్రీవం కాదు! బిజెపికి మొదటిసారి స్వంతంగామెజార్జి వుంది గనక ఖచ్చితంగా సంఘపరివార్‌కు ఇష్టమైన వారే రాష్ట్రపతి అవుతారు. అందులోనూ బలమైన నేతలను ఏ ప్రధాని అక్కడ కూచోబెట్టరు. స్వంత పునాది లేకుండా తమపై ఆధారపడే వారే వుండాలనుకుంటారు. రాజకీయేతరమైన వారిని ఈ సమయంలో ఎంచుకునే అవకాశం అంతకన్నా లేదు. ఒరిస్సాబిజెపి గిరిజిన ఎంఎల్‌ఎ,జార్ఖండ్‌ ప్రస్తుత గవర్నర్‌ ద్రుపది ముద్ము పేరు వినిపిస్తున్నదంటే చాలా కోణాల్లో మోడీ అమిత్‌షా కసరత్తుచేశారన్న మాట. పైగా ఒరిస్సా ఎన్నికల్లో ఎలాగైనా పాగావేయాలనుకుంటున్న వ్యూహానికి కూడా ఇది సరిపోతుంది.

సుప్రీం కేసుతోనే అద్వానీ ఎగిరిపోయారు. ప్రధానిగా తనతో పోటీపడిన సుష్మ వంటి వారిని ఎంపిక చేసేంత విశాలత్వం వూహించలేనిది.పైగా ఆమె ఆరోగ్యమూ అంతంతమాత్రమే. సుమిత్రామహాజన్‌ పేరు కూడావున్నా స్పీకర్‌గా నిలదొక్కుకున్నారు గనక మళ్లీ కదిలించకపోవచ్చు. అసలు అభ్యర్థి ఎవరో తెలియకుండానే టిఆర్‌ఎస్‌వైసీపీ అన్నా డిఎంకె బలపరుస్తుంటే మోడీ అనుకున్నదే జరుగుతుంది. ప్రతిపక్షాల పోటీ రాజకీయ ప్రధానమే అవుతుంది. అందులో వారు ఎన్ని ఓట్లు తెచ్చుకోగలరన్నది భావి రాజకీయ పునస్సమీకరణను నిర్ణయిస్తుంది. జులై 24న ప్రణబ్‌ దా సెలవు పుచ్చుకోవలసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.