స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కేబినెట్ తీసుకోవాల్సిన నిర్ణయంపై ముందుగా ఎందుకు మాట్లాడారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ నెలాఖరులోపు వస్తుందని ప్రకటించారు. ముందుగా సీతక్క చేసిన ప్రకటన మీడియాలో వైరల్ అయింది. అయితే ఆమె అప్పుడే వివరణ ఇచ్చారు. తాను ఫలానా తేదీలోపు వస్తుందని చెప్పలేదని.. ఎన్నికలకు మాత్రమే సిద్ధం కావాలని పిలుపునిచ్చానన్నారు.
ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఇలాంటి ప్రకటనే చేశారు. దీంతో మహేష్ కుమార్ గౌడ్ కు కోపం వచ్చింది. క్యాబినెట్ సమావేశానికి ముందే స్థానిక సంస్థల ఎన్నికల తేదీని ప్రకటించడం ఏంటని మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మంత్రి శాఖ వివరాలు , మరో శాఖ మంత్రి ఎలా చెప్తారని కూడా అసంతృప్తి వ్యక్తం చేసారు. మంత్రులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. పార్టీతో సంప్రదించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరి కాదని స్పష్టం చేశారు.
తెలంగాణ మంత్రులు తమ పరిధిలో లేని అంశాలతో పాటు సున్నితమైన అంశాలపైనా సొంతంగా చేస్తున్న ప్రకటనలతో పార్టీకి నష్టం కలుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. పైగా మంత్రులు .. తమ తమ శాఖలకు సంబంధించి ఇతరులు ప్రకటనలు చేయడం ఏమిటని పీసీసీకి ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ కావాల్సి ఉంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కేబినెట్ సమావేశానికి ముందు సీతక్క మీడియాతో మాట్లాడారు. తాను ఎన్నికల సన్నద్ధత గురించి మాట్లాడితే..ఎన్నికల తేదీ గురించి చెప్పానన్నట్లుగా తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు.