అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణగా కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరియు శాంతిని శాసించే స్థాయికి చేరుకున్నాయి. గత కొద్ది రోజులుగా ఇరాన్ శాంతి చర్చల దిశగా మొగ్గు చూపుతున్నప్పటికీ, వాషింగ్టన్ మాత్రం లేనిపోని వివాదాలు తెచ్చి పెడుతోంది. ఇరాన్ తన అణు కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయడమే కాకుండా, తన సార్వభౌమత్వాన్ని అమెరికా ఆంక్షల ముందు తాకట్టు పెట్టాలని ట్రంప్ సర్కారు భావిస్తోంది.
ఆంక్షలు – ఆర్థిక దిగ్బంధనం
అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. చమురు ఎగుమతులు నిలిచిపోవడం, ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని, ఇరాన్ను చర్చల వద్దకు రప్పించి తనకు అనుకూలమైన ఒప్పందాలపై సంతకాలు చేయించుకోవాలని ట్రంప్ వ్యూహం పన్నారు. అయితే, అమెరికా కాళ్ల దగ్గర తలవంచే ప్రసక్తే లేదని, ఆంక్షలు తొలగించకుండా చర్చలు జరిపేది లేదని ఇరాన్ స్పష్టం చేస్తోంది.
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు
హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా యుద్ధ నౌకలు, డ్రోన్ల సంచారం యుద్ధ వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది. ఇరాన్ దారికి రాకపోతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని ట్రంప్ హెచ్చరిస్తుండగా, తమ భూభాగంపై దాడి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ ప్రతి హెచ్చరికలు చేస్తోంది. ఇరాన్ మద్దతు ఉన్న దేశాలు , సాయుధ బలగాలు అమెరికా స్థావరాలపై దాడులు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మధ్యేమార్గం ఉండాలి !
ప్రస్తుతానికి రెండు దేశాల మధ్య స్తబ్దత నెలకొంది. ట్రంప్ తన మొండి వైఖరితో ఇరాన్ను లొంగదీసుకోవాలని చూస్తుంటే, ఇరాన్ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి పోరాడుతోంది. జరగబోయే పరిణామాలను బట్టి చూస్తే, అమెరికా తన ఆంక్షలను మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇరాన్ ఐరోపా దేశాల ద్వారా మధ్యవర్తిత్వం కోరితే తప్ప, ఈ ఉద్రిక్తతలు తగ్గేలా కనిపించడం లేదు. ఏది ఏమైనా, ట్రంప్ అనుసరిస్తున్న అత్యధిక ఒత్తిడి విధానం ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరగడానికి,భౌగోళిక రాజకీయ అస్థిరతకు దారితీస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు అగ్రరాజ్యం తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
