తెలంగాణ రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ TG RERA రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత పారదర్శకంగా మార్చేందుకు అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. నూతన నిబంధనల ప్రకారం, భూ యజమానులు , లాభాల్లో వాటా కలిగిన వ్యక్తులను కూడా ఇకపై ప్రమోటర్లు గానే పరిగణించనున్నారు. సాధారణంగా బిల్డర్లు మాత్రమే ప్రమోటర్లుగా ఉండి బాధ్యత వహించే పాత పద్ధతికి స్వస్తి పలికి, ప్రాజెక్టులో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ జవాబుదారీ చేయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.
ఈ మార్పు వల్ల కొనుగోలుదారులకు రక్షణ మరింత పెరగనుంది. గతంలో ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయినప్పుడు లేదా వివాదాలు తలెత్తినప్పుడు భూ యజమానులు తమకు సంబంధం లేదని తప్పించుకునే అవకాశం ఉండేది. కానీ, తాజా సర్క్యులర్ ప్రకారం ప్రాజెక్టులో ఏదైనా లోపం జరిగినా లేదా వినియోగదారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, బిల్డర్‌తో సమానంగా భూ యజమాని కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ భూ యజమానులు తమకు కేటాయించిన వాటాను నేరుగా విక్రయించినా, వారు రేరా నిబంధనల పరిధిలోకి వస్తారు.
అంతేకాకుండా, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కూడా రేరా స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. ఏదైనా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో, బిల్డర్ , భూ యజమాని మధ్య జరిగిన ఒప్పంద పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి. జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ చేసుకున్న సందర్భాల్లో ఇద్దరినీ ప్రమోటర్లుగా గుర్తిస్తూ రేరా సర్టిఫికేట్ జారీ చేస్తుంది. దీనివల్ల ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో , 70 శాతం నిధులను ప్రత్యేక ఖాతాలో జమ చేయాలనే నిబంధనల్లో భూ యజమానుల పాత్ర కూడా కీలకం కానుంది.
ఈ కొత్త నిబంధనలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో కొంత చర్చకు దారితీసినప్పటికీ, దీర్ఘకాలంలో ఇది మార్కెట్ నియంత్రణకు దోహదపడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా అమాయక కొనుగోలుదారులు మోసపోకుండా ఉండేందుకు, ప్రాజెక్ట్ డెలివరీలో జాప్యాన్ని అరికట్టేందుకు ఇది ఒక విప్లవాత్మక అడుగు. ల్యాండ్ ఓనర్లు మరియు ప్రమోటర్ల మధ్య ఉండే అంతర్గత గొడవలు ఇకపై ప్రాజెక్టులపై ప్రభావం చూపకుండా, ఇద్దరినీ చట్టబద్ధంగా బాధ్యులను చేయడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో విశ్వసనీయత పెరుగుతుందని భావిస్తున్నారు.
