రేవంత్‌ కథ – తెలిసిపోతున్న క్లైమాక్స్‌

టిటిడిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్ది కాంగ్రెస్‌ చేరిక వ్యవహారంలో మీడియా శ్రుతి మించి హైప్‌ చేస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అసలు రేవంత్‌ ప్రధాన ఆకర్షణే ప్రచారం గనక తనుకూడా వ్యూహాత్మకంగానే నాటకీయంగా వ్యవహరిస్తూ ప్రచారాన్ని కొనసాగించుకుంటున్నారు. పొలిట్‌బ్యూరో సమావేశానికి ఆయన రావడమే గొప్ప విశేషమైనట్టు దానితో టిడిపి నేతల చర్చల తీరు మారినట్టు ఒక కథనం రావడం మరీ విచిత్రం. నిజానికి ఈ సమావేశంలో నాయకులంతా తనతో వున్నట్టే చూపించుకోవాలని రేవంత్‌ ఎత్తుగడ అని కొందరు నేతలంటున్నారు. అయితే ఆఖరుకు రేవంత్‌ నిస్సందేహంగా దాటవేతతో బయిటపడ్డారు. అద్యక్షుడు చంద్రబాబుకే చెబుతానని అనడం వరకూ బాగానే వుంది. ఆలోగా మీడియాలో కథనాలను అనుమతించడం, ప్రోత్సహించడం దేనికి సంకేతం? ఆ కథనాలు నిజం కాదని మీడియాకు చెప్పవలసిందిగా కొందరు నేతలు కోరారు. ముఖ్యంగా అరవింద్‌ కుమార్‌ గౌడ్‌ ఈ విషయంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరడం లేదని స్పష్టత ఇవ్వడానికి నిరాకరించడం ద్వారా రేవంత్‌ తన ఆలోచనలు బయిటపెట్టుకున్నారు. చంద్రబాబుకు ఏదో చెబుతానంటున్నా ఇలాగే వాతావరణం వుంటే ఆయన అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం కూడా ఇబ్బంది కరమే అవుతుంది. ఈ సమావేశాన్ని తన ప్రచారానికి వాడుకోలేకపోయిన రేవంత్‌ చంద్రబాబుతో భేటీని గరిష్టంగా వాడుకోవడం తథ్యం. అప్పుడు మిగిలిన నేతలు అధినేతను తప్పు పడతారు. రేవంత్‌ ముందుగానే తాను కాంగ్రెస్‌లో చేరబోనని చెప్పకపోతే చంద్రబాబు సమయమివ్వడం కూడా విమర్శలకు గురవుతుంది.తెలంగాణలోనే గాక ఎపిలోనూ దాని ప్రభావం పడుతుంది. శాసనసభ సమావేశాల పేరిట కాలం గడిపే అవకాశం ఒకటుంది. కాని ఇంత రభస తర్వాత ఆయనే టిటిడిపి లెజిస్లేచర్‌ పార్టీ నేతగా మాట్లాడ్డం పార్టీకి ఆయనకూ కూడా పరువు తక్కువగా వుంటుంది. కాబట్టి కథ కంచికి అంటే కాంగ్రెస్‌కు చేరకతప్పదు. చేరకపోతే ఆయనకు ఉభయత్రా విలువ పోతుంది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.