రవితేజ అంటేనే మాస్. మాస్ అంటేనే రవితేజ. భీమ్స్ గురించి ఇక చెప్పక్కర్లెద్దు. మాస్ లో పుట్టి, మాస్ లో పెరిగి.. మాస్ బీటుకు కేరాఫ్ అయ్యాడు. వీరిద్దరూ కలిశాక, మాస్ పాట రాకుండా ఎలా ఉంటుంది? ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కోసం ‘వామ్మె వాయో’ అనే పాట రిలీజ్ అయ్యింది. ఇది పూర్తిగా మాస్ బీట్ తో సాగే పాట. ఇందులోని సాహిత్యం, బీటు, రవితేజ ఇద్దరు హీరోయిన్లతో వేసిన స్టెప్పులూ అన్నిటా మాసే. సెట్, కాస్ట్యూమ్స్ అన్నీ కలర్ ఫుల్ గా సాగాయి. స్వాతిరెడ్డి పాడిన పాట ఇది. పవార్ రాశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ఫుల్ లెంగ్తీ మాస్ పాట ఇదే కావొచ్చు.
కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన సినిమా ఇది. రవితేజ సరసన డింపుల్, అషికా రంగనాథ్ కథానాయికలుగా నటించారు. ఈ పాటలో ముగ్గురి మధ్య కెమిస్ట్రీ అదిరిందనే చెప్పాలి. ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటల్లో క్లాస్ లుక్ కనిపించింది. ఇది మాత్రం విరుద్ధంగా సాగిన పాట. ఈ పాటతో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రమోషన్లకు కాస్త ఊపొచ్చిందనే చెప్పాలి. కొన్నాళ్ల పాటు రీల్స్ లో ఈ పాట మార్మోగడం ఖాయం. జనవరి 13న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
