వెంకయ్య కహానీ… రాం మాధవ్‌ గీతాబోధ

బిజెపి సీనియర్‌ నేత వెంకయ్య నాయుడును ఉపరాష్ఠ్రపతి స్థానానికి ఎంపిక చేయడంపై ఆయనతో సహా అనుయాయులంతా వుస్సూరన్నారు. ఆంధ్రజ్యోతిలో ఆర్కే పాపం వెంకయ్య అని కూడా రాసి పారేశారు. అంతే స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది బిజెపి నేతలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఇదంతా చూసి భరించలేక వెంకయ్య స్వయంగా తెలుగు మీడియా ప్రతినిధులను పిలిపించి తన స్థాయి స్థానం తగ్గలేదన్న భావన కలిగించేందుకు తంటాలు పడ్డారు. అసలు రాష్ట్రపతికే తన పేరు పరిశీలనలోకి వచ్చిందని చెప్పారట. అయితే అప్పుడు మోడీ తన వంటి సహచరుణ్ని వదులు కోవడానికి సిద్ధపడలేదట. అదే ఉప రాష్ట్రపతి పదవికి మాత్రం గత్యంతరం లేక వొప్పుకున్నారు. ఇది వెంకయ్య కహానీ. దీంట్లో లొసుగులు చాలా వున్నాయి. తర్కానికి నిలవని పాయింట్లు బోలెడున్నాయి. ఏదైనా పెద్దాయనను ఈ దశలోనూ మరీ ఎక్కువ బాధపెట్టడం మంచిది కాదు గనక వదిలేద్దాం తమాషా ఏమంటే వెంకయ్య వివరణపైన బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ వ్యూహప్రబోధం ప్రచురితమైంది. టీవీల్లోనూ ప్రముఖంగా వచ్చింది. వెంకయ్య ఇంకా పూర్తిగా ఎన్నిక కాకముందే రాం మాధవ్‌ రంగ ప్రవేశం చేశారన్నది సందేశం. రాజకీయాలు అధికారమే లక్ష్యంగా జరుగుతాయి తప్ప ఇందులో ఆవేశాలు గట్రా పెద్ద పాత్ర వహించబోవని రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులే గాక ఎవరు ఏ బాధ్యత నిర్వహించాలో మీడియా నిర్ణయించజాలదని వెంకయ్య మిత్రులకు చురకలేశారు.

నిరావేశంగానూ నిర్దాక్షిణ్యంగానూ రాజకీయచ వ్యూహాలు నడిపించాల్సిందేనని అలనాటి మాధవుడు భగవద్గీతా ప్రవచనం చేసిన స్థాయిలో ఆయన తెలంగాణ బిజెపి సమావేశంలో మాట్లాడారు. మీరు హడావుడి పడటం బాగానేవుంది గాని తెలుగు నాట బిజెపికి అంత దృశ్యం వుందా, మాధవా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.