అమెరికా, చైనాల మధ్య సాగుతున్న AI పోటీలో భారత్ తన ఉనికిని చాటుకోవడానికి విశాఖపట్నం వేదిక కానుంది. నగరం చుట్టూ 100 కిలోమీటర్ల పరిధిలో ఒకే గొడుగు కింద భారీ డేటా సెంటర్లు, సర్వర్ తయారీ యూనిట్లు , పరిశోధనా కేంద్రాలతో కూడిన డేటా సిటీ ఏర్పాటు కాబోతోంది. దీని ద్వారా ఏకంగా 175 బిలియన్లు అంటే సుమారు రూ. 15 లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు తమ అతిపెద్ద AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్‌ను ఇక్కడ నిర్మించేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి.
భారీ విద్యుత్ సామర్థ్యం – 6 గిగావాట్లు
ఈ డేటా సిటీ కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, ప్రపంచస్థాయి కంప్యూటింగ్ పవర్ (అందించే కేంద్రంగా మారనుంది. దీని కోసం 6 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లను ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇందులో సగానికి పైగా ఇప్పటికే ఒప్పందాలు పూర్తయ్యాయి. ఇంతటి భారీ శక్తి అవసరాల కోసం కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. అలాగే, ఈ సెంటర్ల చల్లబరచడానికి వర్షాకాలంలో సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని వినియోగించుకునేలా వినూత్న ప్రణాళికలు రూపొందించారు.
సముద్ర గర్భ కేబుల్స్ – హై స్పీడ్ కనెక్టివిటీ
విశాఖ తీర ప్రాంతాన్ని అంతర్జాతీయ సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్ ల్యాండింగ్ పాయింట్‌గా మార్చడం ఈ ప్రాజెక్టులోని మరో కీలక అంశం. సింగపూర్, మలేషియా వంటి ఆగ్నేయ ఆసియా దేశాలతో నేరుగా అనుసంధానం కావడం ద్వారా డేటా ప్రసార వేగం అద్భుతంగా పెరుగుతుంది. ఇది గ్లోబల్ టెక్ కంపెనీలకు వైజాగ్‌ను ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుస్తుంది. సెర్చ్ ఇంజిన్లు, క్లౌడ్ కంప్యూటింగ్ , ఏఐ అప్లికేషన్ల నిర్వహణకు అవసరమైన అత్యంత తక్కువ లేటెన్సీ ఇక్కడ అందుబాటులోకి వస్తుంది.
లోకేష్ పట్టుదలకు ఫలితం
ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి లభించడమే కాకుండా, 2032 నాటికి వైజాగ్ ఆర్థిక వ్యవస్థను 120 బిలియన్ డాలర్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐటీ మంత్రి నారా లోకేష్ ఈ ప్రాజెక్టును చైనా మోడల్ అభివృద్ధికి దగ్గరగా పోల్చారు. కేవలం డేటా నిల్వకే కాకుండా, సర్వర్లు , శీతలీకరణ వ్యవస్థల తయారీ సంస్థలను కూడా ఆకర్షించడం ద్వారా సంపూర్ణ పారిశ్రామిక ఎకోసిస్టమ్‌ను నిర్మించాలన్నదే ఈ డేటా సిటీ వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ఈ మొత్తం ప్రణాళికను నారా లోకేష్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు.
