ఈ వేసవి సీజన్ ని టాలీవుడ్ సరిగ్గా వాడుకోలేదు. సరిగ్గా ఏంటి… అస్సలు వాడుకోవడం లేదు. పెద్ద సినిమాలేవీ ఈ సీజన్ లో రాలేదు. వచ్చిన మీడియం రేంజ్ సినిమాలు ఆడలేదు. చిన్న సినిమాలవైపు జనం చూడలేదు. అలా.. వేసవి నీరు గారిపోయింది. గతవారం మూడు సినిమాలొచ్చాయి. దేనికీ స్పందన లేదు. ఈ వీకెండ్ కూడా చప్పగా సాగిపోయింది. ఈవారం కూడా పెద్దగా మెరుపుల్లేవు. తెలుగు నుంచి ఒక్క సినిమా కూడా రావడం లేదు. విజయ్ నటించిన తమిళ సినిమా ‘కరుప్పు’ తెలుగులో ‘వీరభద్రుడు’గా విడుదల అవుతోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మించింది. సూర్య ఫేస్ మినహా.. మిగిలిన వాళ్లంతా మనకు కొత్తే. ఎందుకంటే తెలుగులో పాపులర్ అయిన నటీనటులెవరూ ఈ సినిమాలో కనిపించడం లేదు. అదో పెద్ద మైనస్ ఈ సినిమాకు. పైగా ట్రైలర్ చూస్తే ఫక్తు తమిళ మార్క్ కమర్షియల్ సినిమాలా అనిపిస్తోంది. కాకపోతే.. ఇది మినహా థియేటర్లో మరో సినిమా లేదు.
హీరో సూర్యకు తెలుగులో అంతో ఇంతో ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా మాస్లో. బీ,సీల్లో థియేటర్లు సూర్య సినిమా వచ్చినప్పుడు జోష్ తెచ్చుకొంటాయి. అయితే కొంతకాలంగా ఆయనకూ హిట్లు లేవు. వరుసగా అన్నీ ఫ్లాపులే. `వీరభద్రుడు` సినిమాపై కూడా సరైన బజ్ లేదు. ఈ సినిమా ప్రమోషన్లు కూడా మొదలవ్వలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది. ఈ నాలుగురోజుల్లో కాస్తో కూస్తో ప్రమోషన్లు చేసుకొంటే…అటెన్షన్ తెచ్చుకోవొచ్చు. ఆ దిశగా చిత్రబృందం ఏమైనా ప్రయత్నాలు చేస్తుందో లేదో చూడాలి.
