బీజేపీ ఆహ్వానిస్తే చిరంజీవి పార్టీలోకి వస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. బీజేపీలోకి ఎవరైనా వస్తారంటే పిలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. తన మాట కాదనకుండా పిలవగానే చిరంజీవి వస్తారన్నారు. అనేక మంది సినీ ప్రముఖులకు బీజేపీకి సంబంధాలు ఉన్నాయన్నారు. కొందరు పార్టీలో చేరి మంత్రులు కూడా అయ్యారని, కొందరు మాత్రం పార్టీకి ప్రచారం చేశారని గుర్తు చేశారు.
తెలంగాణ రాజకీయాలపై మాట్లాడుతూ..కిషన్ రెడ్డి చిరంజీవి ప్రస్తావన తీసుకు రావడం హాట్ టాపిక్ అవుతోది. ఎందుకంటే తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా విరామం తీసుకున్నానని చిరంజీవి స్పష్టత ఇచ్చారు. గతంలో గోవాలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో స్వయంగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మళ్లీ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తే.. నిర్ద్వంద్వంగా అలాంటి ఆలోచన లేదని చెప్పారు. ఇప్పటికి చాలా సార్లు చెప్పారు. అయినప్పటికీ చిరంజీవిని మళ్లీ రాజకీయాల్లోకి తీసుకు రావాలని గట్టిగా కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
గతంలో జగన్ చిరంజీవిని తన ఇంటికి పిలిచి.. భోజనం స్వయంగా వడ్డించి పంపిన తర్వాత.. చిరంజీవి రాజ్యసభ సీటు ఇస్తున్నట్లుగా ప్రచారం చేశారు. అయితే చిరంజీవి మాత్రం అలాంటి అవకాశాలు లేవని కొట్టి పడేశారు. తర్వాత వైసీపీ నుంచి చిరంజీవికి అలాంటి గౌరవం రాలేదు. అదే సమయలో బీజేపీ నుంచి రాజ్యసభ ఆఫర్ వచ్చిందన్న ప్రచారం జరిగింది. రాష్ట్రపతి నామినేట్ చేయాల్సిన సభ్యుల కోటాలో చిరంజీవిని రాజ్యసభకు పంపుతారని చెప్పుకున్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి తాను పిలిస్తే వస్తారని చెప్పుకున్నారు.
కానీ చిరంజీవి మాత్రం పొలిటికల్ గ్రౌండ్ ను సోదరుడు పవన్ కు అప్పగించారు. పరోక్షంగా అయినా పవన్ కే మద్దతుగా ఉంటున్నారు కానీ.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్న సంకేతాలు మాత్రం ఇవ్వడం లేదు. అయినా కిషన్ రెడ్డి గాల్లో రాయి వేసే ప్రయత్నం చేశారు.