అమరావతిలో జరుగుతున్న పనులపై ప్రపంచబ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సహా ఆర్థిక సాయం చేస్తున్న సంస్థలన్నీ సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు పనులను ఆయా ఆర్థిక సంస్థలకు చెందిన ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. పనులు చాలా వేగంగా జరుగుతూండటంతో ఆ నివేదికల ప్రకారం నిధులు విడుదల చేస్తున్నారు. డిసెంబర్ లో మరో రెండు వేల కోట్ల రూపాయల వరకూ ప్రపంచబ్యాంక్ విడుదల చేయనుంది.
అమరావతికి పైసా ఖర్చు పెట్టని ప్రభుత్వం
అమరావతికి ప్రభుత్వం తన ఖజానా నుంచి పైసా కూడా ఖర్చు పెట్టడం లేదు. అంతా ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ తో పాటు కేంద్రం ఇచ్చే గ్రాంట్లతో నిర్మాణం అవుతోంది. అంతర్జాతీయ బ్యాంకులు ఇచ్చే నిధుల రీపేమెంట్ కేంద్రం చూసుకుంటుంది. అయితే ఆయా సంస్థలు వెంటనే డబ్బులు బదిలీ చేయవు. జరుగుతున్న పనుల్ని బట్టి మాత్రమే ఆర్థిక సాయం చేస్తాయి. అందుకే ప్రతి నెలా.. అమరావతిలో పనుల్ని ఆయా సంస్థలకు చెందిన ప్రతినిధి బృందాలు పరిశీలిస్తాయి.
పనుల వేగంపై వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల సంతృప్తి
అమరావతిలో ఈ సారి ఎలాంటి ల్యాగ్ ఉండదని.. వేగంగా పనులు జరుగుతున్నాయని .. అది కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతున్నాయని ప్రపంచబ్యాంక్ బృందం ప్రశంసించింది. అందుకే తదుపరి విడత నిధులు డిసెంబర్ లో మంజూరు చేస్తున్నారు. పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు నేరుగా చెల్లింపులు చేస్తారు. అందుకే పనులు 24/7 జరుగుతున్నాయి.
పనులు జరిగితే నిధులకు కొరత ఉండదు !
అమరావతిలో పనులు ఆగకుండా సాగితే నిధుల సమస్యే ఉండదు. అయితే అమరావతిపై కుట్రలు చేయడానికి చాలా మంది కాచుకుని కూర్చున్నారు. వారి కుట్రల్ని భగ్నం చేస్తూ.. ప్రభుత్వం శరవేగంగా నిర్మాణం చేస్తోంది. ఇప్పటికే సీఆర్డీఏ ఆఫీసు.. ప్రారంభమయింది. వచ్చే నాలుగైదు నెలల కాలంలో చాలాభవనాలు అందుబాటులోకి వస్తాయి. మరో ఏడాదిన్నరలో ఐకానిక్ టవర్లను కూడా పూర్తి చేసే అవకాశం ఉంది.
