మాజీ మంత్రి అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ ఆడియో కాల్స్ మొదలుకొని, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఉదంతం వరకు ఎన్నో అంశాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అనంతబాబు వీడియో కూడా వైరల్ అయింది. ఇలాంటి నేతల విషయంలో తాము అధికారంలో ఉన్నప్పుడు కనీసం పట్టించుకోలేదు. వివరణ తీసుకోలేదు. విచారణలు చేయించలేదు.
కానీ అప్పట్లో పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి ఆ వీడియోలు, ఆడియోలు ఫేక్ అనిపించేలా ప్రయత్నాలు జరిగాయని, అధికార బలంతో ఆయా నేతలను కాపాడారు. అనాడు తమ పార్టీ నేతలపై అంతటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు కనీస విచారణకు కూడా మొగ్గు చూపని వైసీపీ, ఇప్పుడు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యక్తిగత అంశాలను పట్టుకుని గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
గోరంట్ల మాధవ్ లేదా అవంతి శ్రీనివాస్ ఉదంతాలపై నోరు మెదపని మాజీ మంత్రి రోజా, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి వంటి నేతలు, ఇప్పుడు అరవ శ్రీధర్ విషయంలో ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై అధికారికంగా విచారణ ప్రారంభమైనప్పటికీ, దానిని ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకోవాలని చూడటం వైసీపీ రాజకీయానికి నిదర్శనంగా కనిపిస్తోంది.
ప్రస్తుత ప్రభుత్వం అరవ శ్రీధర్ అంశంపై ఫిర్యాదు అందిన వెంటనే విచారణకు ఆదేశించింది. మహిళా కమిషన్ విచారణ చేయిస్తోంది. వ్యవస్థాగతంగా విచారణ జరుగుతున్నప్పుడు రాజకీయం కోసమే రచ్చ చేస్తున్నారు. తమ హయాంలో జరిగిన కీచక పర్వాలను ప్రైవేట్ వ్యవహారాలు ,మార్ఫింగ్ వీడియోలు కొట్టిపారేసిన నేతలు, ఇప్పుడు అదే తరహా నైతిక విలువలను ఇతరుల విషయంలో ప్రశ్నించడం వారి నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది. అప్పట్లో కనీస చర్యలు తీసుకుని ఉంటే.. ఇప్పుడు ప్రశ్నిస్తే విలువ ఉండేది!
