వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి మూలాలు ఆ పార్టీల సిద్ధాంతాల్లో కంటే, ఆయా కుటుంబాల అంతర్గత విభేదాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జగన్, కేటీఆర్ వంటి నాయకులు తమ సొంత సోదరీమణులైన షర్మిల, కవితలను దూరం చేసుకోవడం కేవలం వ్యక్తిగత విషయంగా మిగిలిపోకుండా, ఆయా పార్టీల మనుగడనే శాసించే రాజకీయ అస్త్రంగా మారుతోంది.
ఇంటి గడప దాటిన రాజకీయ సెగ
వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలలో ఇప్పుడు కనిపిస్తున్న అతిపెద్ద సమస్య సొంత మనుషుల నుంచే ఎదురవుతున్న సవాల్ . ఆస్తుల పంపకాల్లో విభేదాలు ,ఈగోల కారణంగా షర్మిల, కవిత వంటి కీలక నేతలు బయటకు రావడం ఆయా పార్టీల నైతిక బలాన్ని దెబ్బతీసింది. రాజకీయాల్లో ఆడబిడ్డల సెంటిమెంట్ చాలా బలంగా ఉంటుంది. తమకు అన్యాయం జరిగిందని వారు ప్రజల ముందుకు వెళ్లి చెప్తున్నప్పుడు, ఆ ప్రభావం నేరుగా పార్టీ ఓటు బ్యాంక్ మీద పడుతోంది. షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడం, కవిత కొత్త పార్టీ పెట్టనుండటం ఈ సంక్షోభానికి పరాకాష్ట.
ఓట్ల చీలిక – పతనానికి నాంది
రాజకీయాల్లో ఐదు లేదా పది శాతం ఓట్ల చీలిక కూడా ఫలితాలను తలకిందులు చేస్తుంది. షర్మిల చీల్చే ఓట్లు నేరుగా వైఎస్సార్ అభిమానుల ఓట్లే కావడం వైసీపీకి కోలుకోలేని దెబ్బ. గత ఎన్నికల్లో కనీసం ఇరవై సీట్లలో కాంగ్రెస్ చీల్చిన ఓట్ల వల్ల వైసీపీ ఓడిపోయింది. ఈ సారి ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉండనుంది. కాంగ్రెస్ సంప్రదాయక ఓటు బ్యాంకులైన ముస్లిం, క్రిస్టియన్లు షర్మిల వైపు చూస్తున్నారు. అలాగే తెలంగాణలో కవిత కొత్త పార్టీతో తనదైన రాజకీయ ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కవిత రాజకీయం బీఆర్ఎస్ సంప్రదాయ ఓటర్లను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ నాయకులు సాధించే విజయం కంటే, వారు జగన్, కేటీఆర్‌లకు చేకూర్చే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచే స్థానాల్లో ఈ చీలిక పార్టీల పతనానికి ప్రధాన కారణం కాబోతోంది.
గుర్తించడానికి సిద్ధపడని నేతలు
ప్రస్తుతానికి జగన్, కేటీఆర్ ఇద్దరూ ఈ ముప్పును గుర్తించడానికి నిరాకరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది కేవలం కుటుంబ సమస్య అని లేదా వారు పెద్దగా ప్రభావం చూపలేరని భావించడం ఒక రకమైన పొలిటికల్ బ్లైండ్నెస్ లో బతికేస్తున్నారు. ప్రజలు ఓట్లేయాలిగా అనికేటీఆర్ తేలికగా తీసుకోవడం …కాంగ్రెస్ ను అసలు లెక్కలోకి తీసుకోము అని జగన్ అనడం ఈ కోవలోకే వస్తాయి. గతంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఇలాంటి అంతర్గత విభేదాల వల్లే బలహీనపడ్డాయి. ఎదుటివారు చేసే సవాల్‌ను తక్కువ అంచనా వేయడం, ఈగోలకు పోయి రాజీ మార్గాలను మూసివేయడం వల్ల మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.
కుటుంబాలను కలుపుకుంటేనే రేసులో ఉంటారు!
సొంత కుటుంబ సభ్యులనే కలుపుకోలేని వారు ప్రజలను ఎలా కలుపుకుపోతారు? అనే ప్రశ్న ప్రత్యర్థులకు బలమైన ఆయుధంగా మారుతోంది. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు, కానీ నమ్మకం ముఖ్యం. తమ కోసం కష్టపడిన సోదరీమణులను బయటకు పంపడం వల్ల ఆయా నాయకుల ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు తమను తాము కాపాడుకోవాలంటే ముందుగా ఇంటి సమస్యను పరిష్కరించుకోవాలి. ఈగోలను పక్కన పెట్టి ఆడపిల్లలకు దక్కాల్సిన గౌరవం, హక్కు కల్పిస్తేనే పార్టీలు మళ్ళీ పుంజుకుంటాయి. లేకపోతే ఈ కలహాలే ఆయా పార్టీల పతనానికి పునాదిరాళ్లుగా మారే అవకాశం మెండుగా ఉంది.


